Congress: టీఎంసీ సర్‌ప్రైజ్ ఎంట్రీపై కాంగ్రెస్ ఏమందంటే..?

ABN , First Publish Date - 2023-03-27T14:07:24+05:30 IST

రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై వ్యూహరచనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో..

Congress: టీఎంసీ సర్‌ప్రైజ్ ఎంట్రీపై కాంగ్రెస్ ఏమందంటే..?

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై వ్యూహరచనకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో అంటీముట్టనట్టుగా ఉండే తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు జవహర్ సర్కార్, ప్రసూన్ బెనర్జీ హాజరయ్యారు. టీఎంసీతో పాటు డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, భారత్ రాష్ట్ర సమితి, సీపీఎం, ఆర్జేడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, ఐయూఎంఎల్, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్, ఆర్ఎస్‌పీ, ఏఏపీ, జేకే-ఎన్‌సీ, శివసేన (ఉద్ధవ్ వర్గం) ఈ సమావేశానికి హాజరయ్యాయి. టీఎంసీ ఎంపీల హాజరను మల్లికార్జున్ ఖర్గే స్వాగతించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఎవరు ముందుకు వచ్చినా స్వాగతిస్తామని అన్నారు.

''మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నిన్నటి కార్యక్రమంలోనూ, ఇవాల్టి సమావేశంలోనూ పాల్గొన్న వారందరికీ అభినందనలు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజారక్షణకు ముందుకు వచ్చే వారందరినీ స్వాగతిస్తున్నాం. మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు" అని మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు.

బీజేపీ తీరును ఎండగట్టిన మమత..

కాగా, బీజేపీకి గట్టి విమర్శకురాలిగా పేరున్న టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం నేరుగా రాహుల్ పేరు ప్రస్తావించకుండా ఒక ట్వీట్ చేశారు. ''ప్రధాని మోదీ నవ భారతంలో ప్రతిపక్ష నేతలు బీజేపీకి ప్రధాన లక్ష్యంగా మారారు. నేర చరిత్ర కలిగిన బీజేపీ నేతలను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ప్రతిపక్ష నేతలను మాత్రం వారి ప్రసంగాలకు సంబంధించి డిస్‌ క్వాలీఫై చేస్తున్నారు. ఈ రోజు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యం కొత్త పతానాన్ని చూశాము'' అని మమతా బెనర్జీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు

Updated Date - 2023-03-27T14:09:05+05:30 IST