Vidarbha State: సీఎం సభలో ప్రత్యేక రాష్ట్రం నినాదాలు

ABN , First Publish Date - 2023-02-03T18:06:38+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు శుక్రవారంనాడు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వార్దాలోని సాహితీ సదస్సుకు ఆయన హాజరైనప్పుడు ఇద్దరు వ్యక్తులు..

Vidarbha State: సీఎం సభలో ప్రత్యేక రాష్ట్రం నినాదాలు

వార్దా: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)కు శుక్రవారంనాడు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. వార్దాలోని సాహితీ సదస్సుకు ఆయన హాజరైనప్పుడు ఇద్దరు వ్యక్తులు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. విదర్భ అనుకూల కార్యకర్తలు కొందరు ముందుగానే ఈ సభకు హాజరు కాగా, ఇద్దరు వ్యక్తులు సీఎం ప్రసగిస్తుండగా అడ్డుకున్నారు. తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇవ్వాలని నినాదాలు హోరెత్తించారు. దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది వారిని తమ అదుపులోనికి తీసుకుని అక్కడి నుంచి బయటకు తరలించారు.

విదర్భ డిమాండ్ ఏమిటి?

మహారాష్ట్రలో విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ చాలా కాలంగా ఉంది. విదర్భ పరిధిలోకి నాగపూర్, అమరావతి, అకోలా, వర్దా, చంద్రపూర్, గడ్చిరోలి, గోందియా, భండారా, బుల్ధాణా, యవత్మల్ జిల్లాలు ఉన్నాయి. వీటితో విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని విదర్భ అనుకూలవాదులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నారు. విదర్భ రీజియన్‌లో నాగపూర్‌ పట్టణం బత్తాయి, పత్తి పంటల సాగుకు పేరుగాంచింది. రాష్ట్రంలోని ఖనిజ సంపదంలో మూడు వంతులు ఈ ప్రాంతంలోనే ఉంది. విద్యుదుత్పత్తి, అటవీ వనరులు కూడా ఇక్కడ ఎక్కువే. అయినప్పటికీ తాము అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితేనే తమకు మనుగుడ ఉంటుందని, సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని విదర్భ అనుకూలుర వాదనగా ఉంది.

విదర్భ ఆర్థిక అభివృద్ధి మండలి (వీఈడీసీ) కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బలంగా మద్దతు ఇస్తోంది. గతంలోనూ ఈ డిమాండ్‌పై ఆందోళనలు, నిరసనలు వ్యక్తమైనప్పటికీ వారి డిమాండ్ కార్యాచరణలోకి రాలేదు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు విదర్భ రాష్ట్ర డిమాండ్‌పై అధ్యయనం చేయాలని అప్పటి కార్మిక శాఖ మంత్రి పీఏ సంగ్మాను ఆదేశించారు. ఆయన సానూకూలమైన నివేదక ఇచ్చినప్పటికీ కారణాంతరాల వల్ల అది ఆచరణకు నోచుకోలేదు. తాజాగా, మరోసారి విదర్భ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తెరపైకి వచ్చింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించడంద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినట్టే విదర్భకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని విదర్భ అనుకూల వాదుల వాదనగా ఉంది.

Updated Date - 2023-02-03T18:08:59+05:30 IST