Sanjay Raut: రాహుల్‌ను చూసి కేంద్రం వణుకుతోంది..
ABN , First Publish Date - 2023-08-06T15:08:10+05:30 IST
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారంనాడు విమర్శించారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ప్రకటించిన 24 గంటలు కూడా తిరక్కుండానే లోక్‌సభ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు రాహుల్‌కు వేసిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని ఆక్షేపణ తెలిపారు.
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆదివారంనాడు విమర్శలు గుప్పించారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ప్రకటించిన 24 గంటలు కూడా తిరక్కుండానే లోక్‌సభ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు రాహుల్‌కు వేసిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని ఆక్షేపణ తెలిపారు. విపక్ష కూటమి ఇండియా (I.N.D.I.A.) నేతలంతా సోమవారంనాడు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్టు చెప్పారు.
'మోదీ ఇంటిపేరు'పై రాహుల్ 2019లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ నేత వేసిన పరువునష్టం కేసుపై సూరత్ కోర్టు ఇటీవల ఆయనను దోషిగా నిర్దారిస్తూ, రెండేళ్లు జైలుశిక్ష విధించింది. దీంతో రాహుల్ వయానాడ్ లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ రద్దు చేసింది. సూరత్ కోర్టు ఆదేశాలను గుజరాత్ హైకోర్టులోనూ, అనంతరం సుప్రీంకోర్టులోనూ రాహుల్ సవాల్ చేశారు. రాహుల్‌కు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు గత శుక్రవారంనాడు స్టే ఇచ్చింది. దీంతో రాహుల్ సభ్యత్వం పునరుద్ధరించడానికి మార్గం సుగమమైంది. అయితే, ఇంతవరకూ ఆయన సభ్యత్వం పునరుద్ధరించే విషయంపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది.
కాగా, సుప్రీంకోర్టును తీర్పుపై సంజయ్ రౌత్ హర్షం వ్యక్తం చేసింది. న్యాయం బతికే ఉందని ఆయన వ్యాఖ్యానించారు. సూరత్ కోర్టు రాహుల్‌ను ఎందుకు దోషిగా నిర్దారించిందో తనకు అర్ధం కావండలేదని అన్నారు. హైకోర్టు చేసిందేమిటి? రాహుల్‌కు విధించిన శిక్షను నిలుపుదల చేసే నిర్ణయం హైకోర్టు తీసుకుని ఉండవచ్చని, అయితే గుజరాత్‌లోని ఏ కోర్టుకు రాజ్యాంగం, న్యాయం పట్ల ఎలాంటి సంబంధం ఉన్నట్టు కనిపించదని అన్నారు. రాహుల్‌కు విధించిన శిక్షపై న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీఎస్ నరసింహ, సంజయ్ కుమార్‌లతో కూడిన సుప్రీం డివిజన్ బెంచ్ శుక్రవారంనాడు స్టే మంజూరు చేసింది. అయితే, పబ్లిక్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి ప్రసంగాలు చేసేటప్పుడు అత్యంత జాగరూకతతో మాట్లాడాలని, అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి అభిరుచి అనిపించుకోదని వ్యాఖ్యానించింది.