Maharashtra politics: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ థాకరే..

ABN , First Publish Date - 2023-07-19T17:48:07+05:30 IST

మహారాష్ట్ర రాజకీయాలు కొద్దిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బుధవారం మరో ఆసక్తికర ఘట్టం చేటుచేసుకుంది. ఎన్‌సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బీజీపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలను సొంతం చేసుకున్న అజిత్ పవార్ ను శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే కలుసుకున్నారు.

Maharashtra politics: అజిత్ పవార్‌ను కలిసిన ఉద్ధవ్ థాకరే..

ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) కొద్దిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో బుధవారం మరో ఆసక్తికర ఘట్టం చేటుచేసుకుంది. నేషలిస్టు కాంగ్రెస్ పార్టీ‌లో (NCP) తిరుగుబాటు బావుటా ఎగురవేసి, బీజీపీ-శివసేన ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం ద్వారా కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖలను సొంతం చేసుకున్న అజిత్ పవార్ (Ajit pawar)ను శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ థాకరే (Uddhav Thackeray), ఆ వర్గం నేత, ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య థాకరే కలుసుకున్నారు. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్ చేసిన తర్వాత ఆయనను ఉద్ధవ్ థాకరే కలుసుకోవడం ఇదే మొదటిసారి. శాసన సభా మండలి సభ్యుడైన ఉద్ధవ్ థాకరే బుధవారం కొద్దిసేపు సభాకార్యక్రమాల్లో సైతం పాల్గొన్నారు.


రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి సేవలందించాలని అజిత్ పవార్‌ను కోరినట్టు సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ ఉద్ధవ్ థాకరే తెలిపారు. తామిద్దరం గత క్యాబినెట్‌లో కలిసి పనిచేశామని, ఆయన పనితీరు తనకు బాగా తెలుసునని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఖజానా తాళాలు ఆయన వద్దే ఉన్నందున రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకం తనకు ఉందన్నారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వంలో థాకరే డిప్యూటీ (ఉప ముఖ్యమంత్రి)గా అజిత్ పవార్ పనిచేశారు. కాగా, నెల మొదట్లో అజిత్ పవార్, మరో 8 మంది ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు షిండే ప్రభుత్వంలో చేరడంతో శరద్ పవార్ స్థాపించిన ఎన్‌సీపీ నిట్టనిలువునా చీలింది.

Updated Date - 2023-07-19T17:49:13+05:30 IST