Udhayanidhi Stalin: రాష్ట్రపతి ముర్ముని అవమానించడమే సనాతన ధర్మమా.. ఉదయనిధి మరో తూటా
ABN , First Publish Date - 2023-09-06T18:29:53+05:30 IST
‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం మరో తూటా పేల్చారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకుండా...
‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ బుధవారం మరో తూటా పేల్చారు. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముని కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకుండా తీవ్రంగా అవమానించిందని.. ఇది కుల వివక్షకు ఉత్తమ ఉదాహరణ అని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రపతిని ఇలా అవమానించడమే సనాతన ధర్మా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘నూతన పార్లమెంట్ బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ముర్ముని ఆహ్వానించలేదు. కుల వివక్షకు ఇంతకంటే మరో ఉత్తమ ఉదాహరణ లేదు’’ అని ఆయన చెప్పారు.
ఇదే సమయంలో ఉదయనిధి స్టాలిన్ మహాభారతంలోని ద్రోణాచార్య, ఏకలవ్య కథని కూడా చెప్పుకొచ్చారు. ఏకలవ్యుడు తక్కువ కులానికి చెందినవాడు కావడంతో.. ద్రోణాచార్యుడు అతనికి విలువిద్య పాఠాలు నేర్పించేందుకు నిరాకరించాడని తెలిపారు. అయితే.. ఏకలవ్యుడు స్వతహాగా విలువిద్యను అభ్యసించి, ద్రోణాచార్యుని శిష్యుడైన అర్జునుడి కంటే నైపుణ్యం కలిగిన విలుకాడు అయ్యాడని గుర్తు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ద్రోణాచార్యుడు కోపాద్రిక్తుడై.. తన బొటనవేలుని కానుకగా ఇవ్వాలని ఏకలవ్యుడిని కోరాడన్నారు. ఏకలవ్యుడు విధేయత చూపుతూ తన బొటనవేలుని ఇచ్చాడని.. దాంతో విలువిద్య చేయలేని స్థితి ఏర్పడిందని వివరించారు. రాష్ట్రపతి ముర్ము విషయంలోనూ కేంద్రం అలాగే వ్యవహరిస్తోందని వెల్లడించారు.
ఇదిలావుండగా.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటివని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై స్టాలిన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని కొందరు రాజకీయ నేతలు (ముఖ్యంగా బీజేపీ వాళ్లు) డిమాండ్ చేస్తున్నారు. అటు.. స్టాలిన్‌పై కేసులు కూడా నమోదయ్యాయి. అంతేకాదు.. ఆయన తలపై రూ.10 కోట్ల ఆఫర్ కూడా ప్రకటించారు. అయితే.. తాను ఈ బెదిరింపులు, కేసులకు ఏమాత్రం భయపడనని స్టాలిన్ తేల్చి చెప్పారు. తాను కుల వివక్షను మాత్రమే ప్రశ్నించానన్న ఆయన.. తాను చేసిన వ్యాఖ్యల్ని బీజేపీ వాళ్లు పక్కదారి పట్టించారన్నారు. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తానని తెగేసి చెప్పారు.