Make in India : ‘మేక్ ఇన్ ఇండియా’లో యాపిల్ నుంచి ఎయిర్‌బస్ వరకు : జ్యోతిరాదిత్య సింథియా
ABN , First Publish Date - 2023-08-19T16:09:31+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) చెప్పారు.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) చెప్పారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత దేశంవైపు చూస్తున్నాయని, ప్రపంచంలోని నలుమూలల నుంచి కంపెనీలు తమ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను మన దేశంలో ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ‘ఆజ్ తక్ జీ20 సమ్మిట్’లో శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నేడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కంపెనీలు మన దేశానికి వస్తున్నాయని, యాపిల్, ఎయిర్‌బస్ తమ తయారీ కేంద్రాలను (manufacturing facilitiesను) మన దేశంలో ఏర్పాటు చేస్తాయని మీరు కానీ, నేను కానీ ఎన్నడైనా ఊహించామా? అని ప్రశ్నించారు. నేడు ఐఫోన్లలో అత్యధిక భాగం మన దేశంలోనే తయారవుతున్నాయన్నారు. ఎయిర్‌బస్ కంపెనీకి చెందిన సీ-295 ఫెసిలిటీని మన దేశంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. సెమీ కండక్టర్ల రంగంలోకి కూడా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని, దేశం హోదా పెరుగుతోందని తెలిపారు. మన దేశం ఇంగ్లిష్ నుంచి హిందీకి మారుతోందని, పాశ్చాత్యులు హిందీ పదాలను వాడుతున్నారని చెప్పారు. భారత దేశం కారణంగానే యోగా డే అంతర్జాతీయ స్థాయికి చేరిందని తెలిపారు. భారత దేశం సత్తా ప్రపంచానికి తెలుసునన్నారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారాన్ని కనుగొనడానికి ఓ మధ్యవర్తిగా కూడా భారత్‌ను చూస్తున్నారన్నారు.
టీకాకరణ
కోవిడ్-19 టీకాకరణ కార్యక్రమం మోదీ నాయకత్వంలో విజయవంతమైందన్నారు. 98 దేశాలకు 23.5 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్లను మన దేశం సరఫరా చేసిందన్నారు. దీనికి కారకులైన శాస్త్రవేత్తలను, పరిశోధకులను ప్రశంసించారు.
ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్‌పోర్ట్
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మన దేశంలో తొలి ఇంటర్నేషనల్ హబ్ ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు. దీనికోసం ఎయిరిండియా, ఇండిగోలతో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. అనేక ఏవియేషన్ హబ్స్‌ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని, ఈ రంగం ఎల్లప్పుడూ సౌభాగ్యవంతంగా ఉండేలా చేస్తామని చెప్పారు.
వారసత్వ రాజకీయాలపై..
బీజేపీలో ప్రతి ఒక్కరికీ న్యాయమైన అవకాశాలు లభిస్తాయని జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత పదవులను వంశపారంపర్య నేతల కోసం కేటాయిస్తారన్నారు. కానీ బీజేపీలో అత్యున్నత స్థాయి పదవులను ఆ విధంగా కేటాయించరని చెప్పారు.
ముఖ్యమంత్రి పదవిపై..
మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిని చేపడతారా? అని ప్రశ్నించినపుడు సింథియా స్పందిస్తూ, తనకు రాజకీయాల కన్నా ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Udyan Express : ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం..
Evil Nurse : ఏడుగురు పసికందులను చంపేసిన నర్స్.. భారత సంతతి డాక్టర్ కృషితో ఆ రాక్షసికి శిక్ష..