Share News

Uttarkashi Tunnel: కార్మికులను రక్షించేందుకు 42 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి.. ఇంకా ఎంత తవ్వాలంటే..?

ABN , First Publish Date - 2023-11-28T09:09:23+05:30 IST

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యా-బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది.

Uttarkashi Tunnel: కార్మికులను రక్షించేందుకు 42 మీటర్లు డ్రిల్లింగ్ పూర్తి.. ఇంకా ఎంత తవ్వాలంటే..?

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో గల సిల్క్యా-బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు దాదాపుగా సగం తవ్వకం పూర్తి కాగా మరో 44 మీటర్ల మేర తవ్వాల్సి ఉంది. గురువారం నాటికి సొరంగం పైభాగాన్ని చీల్చి కార్మికులను బయటకి తీసుకురావాలని భావిస్తున్నారు. కాగా ఈ డ్రిల్లింగ్ ఆపరేషన్ కోసం 12 మంది రాట్ హోల్ మైనింగ్ నిపుణులు రంగంలోకి దిగారు. కూలీలను బయటకు తెచ్చేందుకు 1.2 మీటర్ల వ్యాసం ఉన్న పైప్‌లను నిలువునా వేయాల్సి ఉంటుంది. టన్నెల్‌ పై నుంచి 300 మీటర్లు ఎత్తుకు వెళ్లి నిలువునా 86 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేస్తున్నారు. అయితే టన్నెల్‌ పైభాగం ఎదురైనప్పుడు కార్మికులు గాయపడకుండా ఏం చేయాలనేది పెద్ద సమస్యగా మారింది. అడ్డంగా తవ్వుకుంటూ వెళ్తున్న బృందంతో దీనిపై సమన్వయం చేసుకోనున్నారు.


ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, హెం సెక్రటరీ అజయ్ భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధు సోమవారం సొరంగం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ క్రమంలో సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మిశ్రా మాట్లాడారు. వారిని రక్షించడానికి బహుళ ఏజేన్సీలు పని చేస్తున్నాయని, ధైర్యంగా ఉండాలని సూచించారు. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సభ్యులు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అటా హస్నైన్ మాట్లాడుతూ ఉత్తరకాశీలో వచ్చే 24 నుంచి 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్‌ను జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయితే వర్షం కారణంగా పనులకు ఆటంకం ఏర్పడే అవకాశం లేదని ఆయన తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలియజేస్తూ వారు సొరంగం రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్నారని, ఆరు అంగుళాల పైప్‌లైన్ ద్వారా ఆహారం, మందులు, ఇతర నిత్యావసరాలను సరఫరా చేస్తున్నట్లు హస్నైన్ చెప్పారు. ప్రస్తుతం వారు ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు.

కాగా సొరంగంలో చిక్కుకున్న కార్మికులు బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు ఒక పైపు ద్వారా మైక్ అందించారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రదేశంలో ఉన్న వైద్యుల బృందం సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో రోజుకు రెండు సార్లు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు మాట్లాడుతున్నారు. అలాగే అప్పుడప్పుడు కుటుంబసభ్యులు కూడా కార్మికులతో మాట్లడడానికి అనుమతిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు టూత్‌పేస్ట్, బ్రష్‌లు, టవల్స్, బట్టలు అందజేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. వారి మనసులను మళ్లించడానికి, నిరాశజనక పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావడానికి సినిమాలు, వీడియో గేమ్‌లున్న మొబైల్ ఫోన్‌లు వారికి అందిస్తున్నట్లు తెలిపారు. నిద్ర కోసం పలు టాబ్లెట్లను కూడా అందిస్తున్నట్టు చెప్పారు. సొరంగంలోనే కార్మికులు యోగా, వ్యామాయం చేస్తూ నడక సాగిస్తునట్టు తెలిపారు. కాగా అక్కడ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ నుంచి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నట్టు సదరు అధికారి చెప్పారు.

Updated Date - 2023-11-28T09:09:25+05:30 IST