Vande Bharat Train: వందే భారత్‌ రైలుకు పెరిగిన డిమాండ్‌

ABN , First Publish Date - 2023-04-11T11:54:12+05:30 IST

చెన్నై సెంట్రల్‌ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు అందుబాటులోకి

Vande Bharat Train: వందే భారత్‌ రైలుకు పెరిగిన డిమాండ్‌

- 16 తేదీ వరకు టిక్కెట్లు ఫుల్‌

అడయార్‌(చెన్నై): చెన్నై సెంట్రల్‌ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించగా, రోజువారీ సర్వీసులు ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రయాణికులు అమితాసక్తిని చూపుతున్నారు. ఫలితంగా ఈ నెల 16వ తేదీ వరకు ఈ రైలులో టిక్కెట్లన్నీ ఫుల్‌ అయిపోయాయి. ఈ నెల 14న తమిళ ఉగాది పండుగ జరుగనుంది. ఈ పండుగకు తమ సొంతూళ్ళకు వెళ్ళే నగరవాసులు ఈ రైలులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపారు. ఫలితంగా, టిక్కెట్లన్నీ అయిపోయాయి. బుధవారం మినహా మిగిలిన రోజుల్లో 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఏసీ చైర్‌ కార్‌, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌కార్‌ అని మొత్తం 596 సీట్లున్నాయి. ఈ రైలు కోయంబత్తూరు(Coimbatore)లో ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 11.50 గంటలకు చెన్నైకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.25 గంటలకు చెన్నై నుంచి బయలుదేరి రాత్రి 8.15 గంటలకు కోయంబత్తూరుకు చేరుతుంది. ఈ రైలులో చెన్నై - కోవై ఛైర్‌కార్‌లో ప్రయాణ ధర రూ.1365, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రూ.2485గా ఉంది. ఈ నేపథ్యంలో, ఈ రైలు ముందస్తు రిజర్వేషన్‌ ప్రారంభం కాగా, ఏసీ చైర్‌ కార్‌లో ఈ నెల 16వ తేది వరకు, ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌లో ఈ నెల 23వ తేది వరకు టిక్కెట్లు ఫుల్‌ అయ్యాయని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-04-11T11:54:12+05:30 IST