Vande Bharat train: ‘వందే భారత్’ ట్రయల్ రన్ విజయవంతం.. ఇక 5.40 గంటల్లోనే..
ABN , First Publish Date - 2023-03-31T11:54:46+05:30 IST
చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య ‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. చెన్నై సెంట్రల్
పెరంబూర్(చెన్నై): చెన్నై సెంట్రల్ - కోయంబత్తూరు(Chennai Central - Coimbatore) మధ్య ‘వందే భారత్’ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. చెన్నై సెంట్రల్ నుంచి 8 బోగీలతో బయల్దేరిన రైలు 5.40 గంటల్లోపే కోయంబత్తూర్ చేరుకుంది. వందేభారత్ రైళ్లకు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుండడంతో దానిని చెన్నై-కోవై మధ్య నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రైలు ట్రయల్ రన్(Trial run) గురువారం ఉదయం జరిగింది. ఇప్పటివరకు వందే భారత్ రైళ్లు 16 బోగీలతో నడుస్తుండగా, చెన్నై-కోవై వందే భారత్ రైలును 8 బోగీలతో నడపాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే ఈ మార్గంలో 16 బోగీలతో శతాబ్ది, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుపుతుండగా, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో వందే భారత్ రైలును 8 బోగీలతో నడపాలని అధికారులు నిర్ణయించారు. ప్రయాణీకుల రద్దీ పెరిగితే బోగీలు పెంచాలని కూడా వారు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై సెంట్రల్ నుంచి తెల్లవారుజామున 5.40 గంటలకు బయల్దేరిన రైలు సేలం, ఈరోడ్, తిరుప్పూర్ స్టేషన్లలో ఆగి, 11.20 గంటలకు కోవై చేరుకుంది. తొలుత 130 కి.మీ వేగంతో రైలు నడపాలని నిర్ణయుంచినా, అంతకంటే తక్కువ వేగంతో ట్రయల్ రన్ సాగినట్లు అధికారులు తెలిపారు. కోవై నుంచి బయల్దేరిన రైలు రాత్రి 8 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంది. ఈ రైలు వారంలో ఆరు రోజులు నడుపనున్నారు. కాగా, చెన్నై-కోవై మధ్య నడుపనున్న రైలును ఏప్రిల్ 8వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.