Vasundhara Raje: పాత వీడియో పోస్ట్ చేసిన వసుంధరా రాజే...ఇది దేనికి సంకేతం

ABN , First Publish Date - 2023-02-04T19:26:41+05:30 IST

రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజే మరోసారి వార్తల్లో నిలిచారు. నాలుగు నెలల క్రితం ఆమె మాట్లాడిన ఒక వీడియో ఇప్పడు..

Vasundhara Raje: పాత వీడియో పోస్ట్ చేసిన వసుంధరా రాజే...ఇది దేనికి సంకేతం

జైపూర్: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు వసుంధరా రాజే (Vasundhara Raje) మరోసారి వార్తల్లో నిలిచారు. నాలుగు నెలల క్రితం ఆమె మాట్లాడిన ఒక వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో పోస్ట్ కావడం, అది వైరల్ అవడం రాజకీయ వర్గాల్లో పలు ఊహాగానాలకు తావిచ్చింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలో జరుగనున్న నేపథ్యంలో ఆమె తన ప్రసంగం వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడం వెనుక పార్టీ అధిష్ఠానానికి సీఎం అభ్యర్థి విషయంలో ఆమె ఏదైనా సంకేతాలిచ్చారా అనే చర్చ జరుగుతోంది.

వసుంధరా రాజే నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఆ వీడియోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేశారు. ''ఒక్కొక్కప్పుడు జనం జోక్ చేస్తుంటారు. వసుంధరా రాజే ఎప్పుడూ భగవంతుడి మీద ఆధారపడుతుంటుందని వాళ్లు నాతో అంటుంటారు. అవును, భగవంతుడిని నేను విశ్వసిస్తుంటానని బలంగా చెబుతుంటాను'' అని ఆ వీడియోలో వసుంధరా రాజే అన్నారు. పరుగులు పెడుతూ పనులు చేస్తూ వెళ్లినా ఐదేళ్లలో అన్ని పనులూ పూర్తికావని అన్నారు. పరుగులు తీయకుండా తాపీగానే పనులు చేయవచ్చు కదా అని తనను చాలా మంది అడుగుతుంటారని, కనీసం పదేళ్లు ప్రభుత్వానికి అవకాశమిస్తే అన్ని పనులు పూర్తవుతాయని తాను చెబుతుంటానని తెలిపారు. ఐదేళ్ల సమయం చాలా తక్కువ సమయమని, ఎంత అవిశ్రాంతంగా పనిచేసినా పనులు పూర్తి చేయలేమని ఆమె ఆ వీడియోలో తెలిపారు.

కాంగ్రెస్‌పై చురకలు వేస్తూ...''పూర్తిగా అలంకరించిన ఇంటిని మేము వదిలివెళ్లాం. కాంగ్రెస్ వచ్చింది. ఆ ఫలాలను అనుభవించింది. పనులన్నీ మేము చేస్తే, కాంగ్రెస్ మాత్రం కేవలం రిబ్బన్ కటింగ్ చేసింది'' అని ఆమె ఆ వీడియోలో అనడం కనిపిస్తుంది. రాజస్థాన్‌లో ప్రస్తుతం అశోక్ గెహ్లాట్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, 2024 జనవరి 14వ తేదీతో రాష్ట్ర అసెంబ్లీ ఐదేళ్ల పదవీ కాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్‌లోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. రాజస్థాన్‌కు 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

Updated Date - 2023-02-04T19:26:43+05:30 IST