Jagdeep Dhankar : న్యాయ వ్యవస్థపై ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-01-11T15:47:55+05:30 IST
భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని పార్లమెంటు మార్చజాలదని, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే అంతిమ
న్యూఢిల్లీ : భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని పార్లమెంటు మార్చజాలదని, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే అంతిమ అధికారం ఉందని చెప్పడాన్ని ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ (Jagdeep Dhankar) పూర్తిగా వ్యతిరేకించారు. 1973లో సుప్రీంకోర్టు (Supreme Court) కేశవానంద భారతి (Keshavananda Bharati) కేసులో ఇచ్చిన తీర్పులో దీనిని చెప్పిందని, దీనిని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. రాజస్థాన్ (Rajastan) విధాన సభలో బుధవారం జరిగిన 83వ అఖిల భారత ప్రిసైడింగ్ అధికారుల (Presiding Officers) సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో లోక్‌సభ సభాపతి ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla) కూడా పాల్గొన్నారు.
న్యాయమూర్తుల నియామకం, న్యాయ వ్యవస్థ పాత్రపై ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రిసైడింగ్ అధికారుల సమావేశం కూడా ఈ చర్చకు మరోసారి వేదికగా నిలిచింది. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినపుడు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ఆయన ఈ సమావేశంలో మాట్లాడుతూ, 1973లో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పు చెడు దృష్టాంతంగా నిలుస్తోందన్నారు. ఈ తీర్పును తాను సమర్థించబోనన్నారు. భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మార్చే అధికారం పార్లమెంటుకు లేదని, ఈ విషయంలో అంతిమ అధికారం సుప్రీంకోర్టుదేనని ఈ తీర్పులో చెప్పారన్నారు. ‘‘మౌలిక నిర్మాణం’’ లేదా ‘‘రాజ్యాంగ ప్రాథమిక శిల్పం’’ అని చెప్తున్నదానిని రాజ్యాంగ సవరణలు ఉల్లంఘించినట్లు ప్రకటిస్తూ, ఆ రాజ్యాంగ సవరణలను రద్దు చేసే అధికారాన్ని మొట్టమొదటిసారి కేశవానంద భారతి తీర్పులోనే సుప్రీంకోర్టు సృష్టించిందని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో ఈ మౌలిక నిర్మాణానికి చాలా ముఖ్యమైనవిగా చెప్తూ అనేక ముఖ్యమైన రూలింగ్స్‌ను సుప్రీంకోర్టు ఇచ్చిందన్నారు. ఈ ప్రక్రియలో పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి హాని జరిగిందన్నారు.
ప్రజా తీర్పుదే పైచేయి అనేది ప్రజాస్వామిక సమాజంలో ఏ మౌలిక నిర్మాణానికైనా మూలమని తెలిపారు. పార్లమెంటు, చట్టసభల ఆధిక్యత, సార్వభౌమాధికారం అనుల్లంఘనీయమైనవన్నారు.
అన్ని రాజ్యాంగ వ్యవస్థలు - న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాఖ, చట్టసభలు - తమ తమ పరిధులకు లోబడి పని చేయాలని, అత్యున్నత స్థాయి ప్రమాణాలతోకూడిన ఔన్నత్యం, గౌరవ, మర్యాదలకు అనుగుణంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు. ఈ అంశంలో ప్రస్తుత పరిస్థితులు సంబంధితులందరూ తీక్షణంగా దృష్టి సారించవలసిన అవసరాన్ని కల్పిస్తున్నాయన్నారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవస్థలను నడిపేవారు తీక్షణంగా దృష్టి సారించాలన్నారు.
రాజ్యాంగాన్ని సవరించేందుకు, శాసనం పట్ల వ్యవహరించేందుకు పార్లమెంటుకుగల అధికారం ఏ ఇతర వ్యవస్థకు లోబడినది కాదన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి జీవన రేఖ అని చెప్పారు. దీనిపై అందరూ ఆలోచనాత్మకంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చట్ట సభలు, న్యాయ వ్యవస్థ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను నెరపవలసిన అవసరం ఉందని, దీనిపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు చర్చించాలని కోరారు.