UP Teacher: నువ్వేం టీచరమ్మవమ్మా.. పిల్లలకు ఇదా నువు నేర్పేది..?

ABN , First Publish Date - 2023-08-25T20:19:57+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో ఒక విద్యార్థి విషయంలో టీచర్ వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. మతం పేరుతో ఒక పిల్లాడిని తన తోటి విద్యార్థులతో కొట్టించి ఓ టీచర్ పైశాచిక ఆనందం పొందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా విచక్షణ లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

UP Teacher: నువ్వేం టీచరమ్మవమ్మా.. పిల్లలకు ఇదా నువు నేర్పేది..?

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఒక విద్యార్థి విషయంలో టీచర్ వ్యవహరించిన తీరు సభ్య సమాజాన్ని సిగ్గుపడేలా చేసింది. మతం పేరుతో ఒక పిల్లాడిని తన తోటి విద్యార్థులతో కొట్టించి ఓ టీచర్ పైశాచిక ఆనందం పొందిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ ఇలా విచక్షణ లేకుండా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కులానికి, మతానికి తావు లేని ఒక పవిత్ర ప్రదేశం పాఠశాల. అలాంటి పాఠశాలలో పరమత ద్వేషంతో విద్యార్థుల మెదళ్లలో మత మౌఢ్యాన్ని నింపుతున్న ఇలాంటి టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నెట్టింట ఒక వీడియో వైరల్ అయింది.


అయితే ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ ఎక్కడ జరిగిందనే విషయంపై స్పష్టత వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ తాలూకాలోని ఖుబ్బాపూర్‌ అనే గ్రామంలోని పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఆ టీచర్ పేరు త్రప్త త్యాగి అని తెలిసింది. వీడియోలో పాపం అమాయకంగా నిల్చుని దెబ్బలు తిన్న ఆ బాలుడు ఒక రైతు కొడుకు. ఆ బాలుడి తండ్రి పేరు ఇర్షాద్ అని తెలిసింది. ఆ వీడియోలోని ఆడియోలో ఏముందంటే.. 'Jitne bhi Muslim Bachche hai…maaro' అని ఆ టీచర్ తోటి విద్యార్థులతో సదరు విద్యార్థిని కొట్టించింది.

నిల్చుని ఉన్న ఆ విద్యార్థిని తొలుత అతని కంటే తక్కువ వయసున్న ఒక పిల్లాడు చెంపదెబ్బ కొట్టాడు. ఆ తర్వాత మరో ఇద్దరు విద్యార్థులు ఆ విద్యార్థిని కొట్టారు. పాపం తనతో రోజూ ఆడుకుంటున్న పిల్లలే కొట్టడంతో ఆ విద్యార్థి ఏడుస్తూ కనిపించిన దృశ్యం గుండె తరుక్కుపోయేలా చేసింది. మతం అంటే ఏంటో కూడా తెలియని మిగతా విద్యార్థులు అమాయకంగా చూస్తూ ఉన్నారు. అక్కడున్న విద్యార్థినీవిద్యార్థులంతా పదేళ్ల వయసు లోపు పిల్లలు. అంత చిన్న వయసులో ఉన్న పిల్లల మెదళ్లలో సదరు టీచర్ మతం పేరుతో విషబీజాలు నాటడం శోచనీయం. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ వీడియో ముజఫర్‌నగర్ పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ట్విటర్ వేదికగా పోలీసులు కూడా ఈ ఘటనపై స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆ టీచర్‌ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని వీడియో చూసిన నెటిజన్లు డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-25T20:20:00+05:30 IST