Vloggers' Cruelty : వైరల్ వీడియోల కోసం వ్లాగర్స్ దారుణాలు

ABN , First Publish Date - 2023-04-02T12:59:08+05:30 IST

సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకాదరణ కోసం వ్లాగర్స్ (Vloggers) అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. భయానక వీడియోలను

Vloggers' Cruelty : వైరల్ వీడియోల కోసం వ్లాగర్స్ దారుణాలు
Children

హైదరాబాద్ : సామాజిక మాధ్యమాల్లో ప్రేక్షకాదరణ కోసం వ్లాగర్స్ (Vloggers) అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. భయానక వీడియోలను చిత్రీకరించడం కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒళ్లు గగుర్పొడిచే మ్యూజిక్ బిట్స్ జత చేసి, లక్షల్లో వ్యూస్ సంపాదిస్తున్నారు. వీడియోల చివర్లో మాత్రం ఓ మంచి సలహాను ఇస్తున్నట్లు నటిస్తున్నారు. ఇటువంటి వీడియోలను తొలగించాలని యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలను కోరుతామని పోలీసులు చెప్తున్నారు.

భయానక వీడియోలను చిత్రీకరించేవారు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఓ చిన్నారికి కారులో లిఫ్ట్ ఇచ్చి, ఆ తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు బెదిరిస్తున్నారు. ఆ చిన్నారి భయంతో వణికిపోతూ, కారు డోర్‌ను తెరచి, క్రిందకు దూకేయడానికి ప్రయత్నిస్తుండగా, అడ్డుకుని, సిరంజిలతో బెదిరిస్తున్నారు. ఈ సన్నివేశాలన్నిటినీ కారులోనే అమర్చిన కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియోకు భయంకరమైన మ్యూజిక్ బిట్స్‌ను జత చేసి, సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు. ఇటువంటి వీడియోలకు యూట్యూబ్‌లో దాదాపు 5 లక్షల వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 60 లక్షల వ్యూస్ వస్తున్నాయి.

చివర్లో ఓ సందేశం

ఇంత దుర్మార్గంగా వీడియోలను చిత్రీకరించి, చివర్లో ఓ సందేశాన్ని ఇస్తున్నారు. ‘పరిచయం లేని వ్యక్తులను లిఫ్ట్ అడగవద్దు’ వంటి సందేశాలను ఇస్తున్నారు. ఈ రీల్స్ చేయడానికి ముందు ఆ చిన్నారుల తల్లిదండ్రుల సమ్మతి పొందినదీ, లేనిదీ చెప్పడం లేదు.

ప్రేక్షకుల తప్పు

వ్లాగర్స్ రెచ్చిపోవడానికి కారణం ప్రేక్షకులు కూడానని వెల్లడవుతోంది. మైనర్లతో భయానక వీడియోలు చేసే చానళ్లకు సబ్‌స్క్రైబర్లు క్షణాల్లో పెరుగుతున్నారు. ఇటువంటి హింసాత్మక వీడియోలను చూడటం సరైనది కాదని, ప్రోత్సహించకూడదని ప్రేక్షకులు తెలుసుకోవాలి.

పోలీసుల స్పందన

పోలీసులు మాట్లాడుతూ, ఇటువంటి వీడియోలు చేయడానికి కొన్నిసార్లు కొందరు బాలలు అంగీకరిస్తారన్నారు. వారు సమ్మతించినప్పటికీ, ఇది కేవలం అవగాహన కల్పించడం కోసమేనని మొత్తం వీడియోలో ప్రకటించవలసి ఉంటుందని చెప్పారు. బాలల సమ్మతి లేకుండా ఇటువంటి వీడియోలను చిత్రీకరిస్తే, వాటిపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా, వేధింపుల తీవ్రతనుబట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. భారత శిక్షా స్మృతి, ఆదాయపు పన్ను చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాల ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. ఇటువంటి వీడియోలను తనిఖీ చేస్తున్నామని, చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భయపెట్టి సొమ్ము చేసుకుంటున్నారు

బాలల హక్కుల కార్యకర్తలు మాట్లాడుతూ, బాలల భయాలను యూట్యూబర్లు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇటువంటి వీడియోలను చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి :

Modi Vs Sibal : మోదీ ‘సుపారీ’ ఆరోపణలపై కపిల్ సిబల్ అనూహ్య స్పందన

Modi Surname Case : జైలుకెళ్లేందుకు రాహుల్ గాంధీ సిద్ధమేనా?.. కాంగ్రెస్ వర్గాల కీలక సంకేతాలు..

Updated Date - 2023-04-02T12:59:08+05:30 IST