Poster War: మాజీ సీఎంపై సంచలన పోస్టర్లు
ABN , First Publish Date - 2023-06-23T14:39:19+05:30 IST
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు అవినీతి ఆరోపణలు చేయడంలో తలమునకలవుతున్నాయి. పోస్టర్ల వార్ కు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ పై శుక్రవారంనాడు భోపాల్‌లో పోస్టర్లు వెలిసాయి. "వాంటెడ్ కరప్షన్ నాథ్'' అంటూ ఆ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి.
భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya pradesh) అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు అవినీతి ఆరోపణలు చేయడంలో తలమునకలవుతున్నాయి. పోస్టర్ల వార్ (posters war)కు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ (Kamalnath)పై శుక్రవారంనాడు భోపాల్‌లో పోస్టర్లు వెలిసాయి. "వాంటెడ్ కరప్షన్ నాథ్'' అంటూ ఆ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కమల్‌నాథ్ ఇటీవల అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులు ఈ పోస్టర్లు వేసినట్టు తెలుస్తోంది. మహాకాళ్ లోక్ కారిడార్ ప్రాజెక్టుపై కమల్‌నాథ్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు.
దేవుణ్ణి కూడా బీజేపీ విడిచిపెట్టలేదు...
మధ్యప్రదేశ్‌లోని మహాకాళ్ లోక్ కారిడార్ నిర్మాణంలో భారీ కుంభకోణం చోటుచేసుకుందని, అవినీతి విషంయలో దేవుణ్ణి కూడా బీజేపీ విడిచిపెట్టడం లేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఈనెల 19న మహిద్‌పూర్ టౌన్లో జరిగిన బహిరంగ సభలో కమల్‌నాథ్ ఆరోపించారు. ఈ కుంభకోణం ఇంకా పెద్దగానే ఉండవచ్చని అన్నారు. మతాన్ని కూడా అవినీతికి మార్గంగా బీజేపీ మలుచుకుంటోందని, మధ్యప్రదేశ్‌ను అవినీతి రాష్ట్రంగా మార్చిందని విమర్శించింది. మహాకాళ్ లోక్ కారిడార్ విషయంలో జరిగిన అవినీతి ఇటు ఉజ్జయిని ప్రతిష్ఠనే కాకుండా, దేశ ప్రతిష్టను కూడా మసకబార్చిందని ఆరోపించారు. మహాకాళేశ్వర్ ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సప్తరుషుల విగ్రహాలు గత నెలలో కుప్పకూలడంతో భారీ నష్టం జరిగింది. ఈ కారిడార్ తొలి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించారు.
11 నెలల్లో ఎంతో చేశాం..
కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో గత మార్చిలో కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. కాగా, డిసెంబర్ 2018 నుంచి తాము అధికారం కోల్పోవడానికి ముందు వరకూ 27 లక్షల రైతు రుణాలను మాఫీ చేశామని, విద్యుత్‌ను తక్కువ ధరకే అందించామని, గోవుల కోసం షెడ్లు నిర్మించామని, కేవలం పదకొండున్నర నెలల్లోనే ఇవన్నీ సాధించామని కమల్‌నాథ్ తెలిపారు. రూ.100కే 100 యూనిట్ల విద్యుత్ ఇచ్చామని, 1,000 గోశాలలు నిర్మించామని చెప్పారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గత 18 ఏళ్లలో 22,000 హామీలు ఇచ్చారని, ఏ ఒక్కటి నెరవేర్చలేదని ఆరోపించారు.