DK Shivakumar: పీఎంకు ఎందుకు స్వాగతం చెప్పలేదంటే?... డీకే వివరణ
ABN , First Publish Date - 2023-08-26T15:52:22+05:30 IST
ప్రధానమంత్రి బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయనకు సిద్ధరామయ్య సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం చెప్పలేదంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వరణ ఇచ్చారు. తనను కలుసుకునేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ విమానాశ్రయానికి రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పీఎంఓ నుంచి అధికారిక సమాచారం వచ్చిందన్నారు.
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) బెంగళూరు (Bengaluru) పర్యటన సందర్భంగా ఆయనకు సిద్ధరామయ్య సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం స్వాగతం చెప్పలేదంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) వివరణ ఇచ్చారు. తనను కలుసుకునేందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ విమానాశ్రయానికి రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పీఎంఓ నుంచి అధికారిక సమాచారం వచ్చిందన్నారు. పీఎంకు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ పీఎంఓ సమాచారం మేరకు దూరంగా ఉన్నామని చెప్పారు.
''ప్రోటోకాల్ గురించి మాకు బాగా తెలుసు. ఎవర్ని ఎలా గౌరవించాలనే రాజకీయ పరిజ్ఞానం మాకు ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రయాన్-3 సక్సెస్‌పై శాస్త్రవేత్తలను అభినందించేందుకు మొదటిసారిగా కర్ణాటకకు ప్రధానమంత్రి వచ్చారు'' అని డీకే తెలిపారు. పీఎంఓ కార్యాలయం నుంచి సమాచారాన్ని గౌరవించి తాము ప్రధానికి ఆహ్వానం పలికే కార్యక్రమానికి దూరంగా ఉన్నామని చెప్పారు. పొలిటకల్ గేమ్ ముగిసిందని, ఇప్పుడు తామంతా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించామని తెలిపారు.
కేపీసీసీ పునర్వవస్థీకరణ
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ)ని పునర్వవస్థీకరించే ఆలోచన చేస్తున్నట్టు డీకే ఈ సందర్భంగా తెలిపారు. కేపీసీసీలోని చాలా మంది మంత్రులు కావడంతో కొత్త లీడర్లకు కేపీసీసీలో అవకాశం కల్పించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఐదు హామీలు ఎలాంటి వివక్ష లేకుండా అన్ని కమ్యూనిటీలకు అందేలా చేశామన్నారు. కావేరీ జలాల విషయంలో కేంద్ర స్థాయిలో తాము జరుపుతున్న పోరాటానికి కలిసివచ్చే రాష్ట్ర ఎంపీలు, ఇతర పార్టీలను తాము స్వాగతిస్తామని చెప్పారు.