Rahul Gandhi: చెప్పిందే చేస్తాం, అవినీతిరహిత పాలన అందిస్తాం: రాహుల్

ABN , First Publish Date - 2023-05-20T14:32:48+05:30 IST

బెంగళూరు: కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందించనుందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. శ్రీ కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య తదితరుల ప్రమాణ స్వీకారం అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, విద్వేషంపై ప్రేమ సాధించిన గెలుపు ఇదని అన్నారు.

Rahul Gandhi: చెప్పిందే చేస్తాం, అవినీతిరహిత పాలన అందిస్తాం: రాహుల్

బెంగళూరు: కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత పాలన అందించనుందని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలిపారు. తమ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని చెప్పారు. శ్రీ కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య (Siddaramaiah), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar), మంత్రులుగా 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తర్వాత ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలించదంటూ వివిధ విశ్లేషణలు జరిగాయని అన్నారు. అయితే తాను చెప్పదలచుకున్నది ఒకటేనని, పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన తరగతులకు బాసటగా నిలవడం వల్లే కాంగ్రెస్ గెలుపు సాకారమైందని అన్నారు.

''మా వెంట నిజం ఉంది, మా వెనుక పేద ప్రజలు ఉన్నారు. బీజీపీ దగ్గర డబ్బు ఉంది, పోలీసులు ఉన్నారు, ప్రతీదీ వారి దగ్గర ఉంది. కానీ కర్ణాటక ప్రజలు వారి అధికారాన్ని ఓడగొట్టారు'' అని రాహుల్ అన్నారు. విద్వేషంపై ప్రేమ గెలిచిందని అభివర్ణించారు. ప్రజలు బీజేపీ అవినీతిని సైతం తిప్పికొట్టారని అన్నారు. విద్వేషాన్ని తుడిచిపెట్టి, ప్రేమను తెస్తామని, విద్వేష మార్కెట్‌లో ప్రేమ దుకాణాలు తెరుస్తామని భారత్ జోడో యాత్రలో తాము చెప్పామని అన్నారు. విద్వేషంపై ప్రేమదే గెలుపని ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు 5 ప్రధాన హామీలు ఇచ్చిందని, తాము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వమని, ఏది చెప్పామో అదే చేస్తామని అన్నారు. మరో ఒకటి రెండు గంటల్లోనే క్యాబినెట్ తొలి సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలోనే ప్రజలకు ఇచ్చిన 5 హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ ప్రకటించారు.

Updated Date - 2023-05-20T14:32:48+05:30 IST