Kamal Hassan: పార్టీ వెబ్‌సైట్ హ్యాక్... కాంగ్రెస్‌తో విలీనం అబద్ధమన్న ఎంఎన్‌ఎస్
ABN , First Publish Date - 2023-01-27T20:19:42+05:30 IST
సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హాసన్ 'మక్కల్ నీది మయ్యం' పార్టీ వెబ్‌సైట్ హ్యాక్అ..
చెన్నై: సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చిన కమల్‌హాసన్ (Kamal hassan) 'మక్కల్ నీది మయ్యం' (Makkal Needhi Maiam) పార్టీ వెబ్‌సైట్ హ్యాక్ (Website Hacked) అయింది. దీనికి ముందే కాంగ్రెస్‌తో ఎంఎన్ఎం విలీనం కాబోతోందంటూ ఆ పార్టీ వెబ్‌సైట్‌లో ఒక ప్రకటన కనిపించడంతో అయోమయం నెలకొంది. దీనిపై ఎంఎన్ఎస్ శుక్రవారంనాడు వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఎంఎన్ఎం విలీనం వార్తల్లో నిజం లేదని, తమ వెబ్‌సైట్‌ను ఎవరో హ్యాక్ చేశారని వివరణ ఇచ్చింది. వెబ్‌సైట్‌ను పునరుద్ధరించే పని జరుగుతోందని తెలిపింది.
''హ్యాకింగ్ ఘటనపై మేము దర్యాప్తు జరుపుతున్నారు. విలీనం (కాంగ్రెస్‌తో) వార్త పూర్తిగా అబద్ధం. అలాంటి ఆలోచనలు ఏమీ లేవు. కాకపోతే ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మాత్రం మద్దతిస్తున్నాం. దీనిపై మా నేత కమల్‌హాసన్ త్వరలో అధికారిక ప్రకటన చేస్తారు'' అని ఎంఎన్ఎం ప్రతినిధి మురళి అప్పాస్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
కాగా, శుక్రవారం ఉదయం ఎంఎన్ఎం అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో విలీనం కావాలని పార్టీ నిర్ణయించినట్టు ఆ ప్రకటనలో ఉంది. ''సేవ్ ఇండియా, ది సౌత్ ఏసియన్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ ప్రయత్నాలకు మక్కల్ నీది మయ్యంలోని కమల్‌తో పాటు, పార్టీ సభ్యులంతా రాహుల్‌కు అండగా నిలుస్తారు. ఆ కారణంగానే కాంగ్రెస్‌తో విలీనం కావాలని మేము నిర్ణయించాం. తద్వారా పార్టీ మరింత బలపడి, భారతీయ జనతా పార్టీని ఓడించే సత్తా పెంచుకుంటుంది'' అని ఆ ప్రకటన పేర్కొంది. ఇందిరాగాంధీని ఓడించేందుకు భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలన్నీ జనతా పార్టీగా ఏర్పడినప్పుడు, బీజేపీని ఓడించేందుకు ఒకేరకమైన సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఎందుకు విలీనం కాకూడదంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ ప్రకటన ఉటంకించింది.
కాగా, ఈనెల 27న జరుగనున్న ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇలాంగోవన్‌కు మద్దతు ఇస్తున్నట్టు ఎంఎన్ఎం ఈ వారం ప్రారంభంలో ప్రకటించింది. దీనికితోడు, న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనూ కమల్ హాసన్ పాల్గొన్నారు.