MP Assembly Polls: మూడోసారి అధికారమిస్తే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: మోదీ
ABN , First Publish Date - 2023-11-14T15:03:32+05:30 IST
ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. మూడోసారి తాను ఇక్కడే ఉంటే (ప్రధాని స్థానంలో) మన దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు.
ఇండోర్: ప్రపంచదేశాల్లో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ నిలుస్తుందని నిపుణులంతా చెబుతున్నారని ప్రధాని మోదీ (Narendra Modi) అన్నారు. మూడోసారి తాను ఇక్కడే ఉంటే (ప్రధాని స్థానంలో) మన దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానంలోకి తీసుకు వెళ్లే పూచీ తనదని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియవస్తుండటంతో ప్రధాని సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. బెటుల్, షాజపూర్, జబువా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. షాజాపూర్ ఎన్నికల ర్యాలీలో మంగళవారంనాడు ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని మధ్యప్రదేశ్ నుంచి తమకు రిపోర్టులు అందుతున్నాయని, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించక తప్పదని అన్నారు.
అవినీతి, లూటీలు చేయడం హస్తానికి (కాంగ్రెస్) బాగు తెలుసునని, కాంగ్రెస్ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ వినాశనం తప్పదని ప్రధాన నరేంద్ర మోదీ అన్నారు. ''కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు మోదీ గ్యారెంటీల ముందు నిలవవు. మోదీ గ్యారెంటీ ఇచ్చారంటూ ఆ హామీని నెరవేర్చితీరుతారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా అక్కడ వినాశనం తప్పదనే విషయం ప్రజలందరికీ తెలుసు. ఈ ఎన్నికలతో కాంగ్రెస్ పార్టీ అవినీతి, ప్రభుత్వ ఖజానా లూటీలను నిలువరించాలి'' అని మోదీ పిలుపునిచ్చారు.
రాహుల్‌కు చరకలు
దేశ ప్రజలు చైనాలో తయారైన మొబైల్ ఫోన్స్‌ను వాడుతున్నారంటూ రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను మోదీ తిప్పికొట్టారు. కాంగ్రెస్‌కు చెందిన ఒక జ్ఞాని దేశంలోని ప్రజలంతా చైనా మొబైల్స్ వాడుతున్నారని చెప్పడం తాను విన్నానని, వీళ్లంతా ఏ ప్రపంచంలో ఉన్నారో తెలియదని, వాస్తవాన్ని చూడలేని వాళ్లని మోదీ విమర్శించారు. మొబైళ్ల తయారీలో భారత్ ప్రపంచ దేశాల్లో రెండో పెద్దదేశమని అన్నారు. ప్రపంచదేశాల్లో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌ను త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుపుతామని అన్నారు. కాగా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న జరుగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి.