Share News

Chhattisgarh Assembly polls: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2023-11-15T17:03:38+05:30 IST

దేశవ్యాప్తంగా కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పడగానే కులగణనపైనే తొలి సంతకం చేస్తామని అన్నారు.

Chhattisgarh Assembly polls: ఢిల్లీలో అధికారంలోకి రాగానే తొలిసంతకం దానిపైనే: రాహుల్ గాంధీ

బేమేతరా: దేశవ్యాప్తంగా కులగణన (Caste census) జరగాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి స్పష్టత ఇచ్చారు. ఢిల్లీలో తమ ప్రభుత్వం ఏర్పడగానే కులగణనపైనే తొలి సంతకం చేస్తామని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తీసుకోనున్న అత్యంత విప్లవాత్మక చర్యగా దీనిని ఆయన అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బేమతరా జిల్లాలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ, ఛత్తీస్‌గఢ్‌లో తమ ప్రభుత్వం ఏర్పడితే కుల సర్వే జరిపిస్తామని హామీ ఇచ్చారు.


''ఓబీసీలకు హక్కులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, ఓబీసీలే లేరని వాళ్లు (బీజేపీ) చెబుతుంటారు. ఓబీసీలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారనేది బయటకు రావాలి. అది 10 శాతం, 20 శాతం లేదా 60 శాతం కావచ్చు. జనాభాలో ఓబీసీల పార్టిసిపేషన్ చాలా ఉంది. నరేంద్ర మోదీ చేసినా చేయకపోయినా ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల సర్వేను మేము జరిపిస్తాం. ఢిల్లీలో మా ప్రభుత్వం వస్తే కులగణనపైనే తొలిసంతకం చేస్తాం'' అని రాహుల్ అన్నారు.


దేశంలో ఓబీసీలు, దళితులు, గిరిజనుల నిజమైన జనాభా ఎంత ఉందే తెలిస్తే, వారి నిజమైన శక్తి ఏమిటో వెలుగు చూస్తే దేశంలో గణనీయమైన మార్పు వస్తుందని, జనగణన చేపడితే స్వాతంత్ర్య వచ్చిన తర్వాత తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇదే అవుతుందని రాహుల్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని మహిళలందరికి ఆర్థిక సాయం కింద వారి అకౌంట్లలో ఏటా రూ.15,000 జమ అవుతాయని చెప్పారు. కేజీ నుంచి పీజీ వరకూ విద్యార్థులందరికీ ఉచిత విద్య అందించాలనే చారిత్రక నిర్ణయాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు.


కాగా, ఛత్తీస్‌గఢ్ అసెంబ్ల రెండో విడత పోలింగ్ నవంబర్ 17న జరుగనుంది. తొలి విడత పోలింగ్ ఈనెల 7న ముగిసింది. రాజస్థాన్‌లో నవంబర్ 25న పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలకు 68 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. బీజేపీ 15 సీట్లకు పరిమితమైంది. రాజస్థాన్‌లోని 200 స్థానాల్లో కాంగ్రెస్ 99 సీట్లు గెలుచుకుని బీఎస్‌పీ, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేసింది. బీజేపీ 73 సీట్లకు పరిమితమైంది.

Updated Date - 2023-11-15T17:04:24+05:30 IST