Udhayanidhi Stalin: కాంగ్రెస్ ముక్త భారత్ అని ఆయన అనలేదా?
ABN , First Publish Date - 2023-09-04T15:40:10+05:30 IST
సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటానన్నారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనలేదా అని ప్రశ్నించారు.
చెన్నై: సనాతన ధర్మం (Sanatana dharma) పై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ (BJP) వక్రీకరించిందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) అన్నారు. తన మాటలకు తాను కట్టుబడి ఉంటానని, ఎలాంటి న్యాయపరమైన చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 'కాంగ్రెస్ ముక్త్ భారత్' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనలేదా అని ప్రశ్నించారు. దాని అర్ధం ఏమిటని నిలదీశారు.
సనాతన ధర్మం మలేరియా, డెంగీ, కరోనా లాంటిదని, దోమలను, వైర్‌సను నిర్మూలించినట్లే దానినీ సంపూర్ణంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని శనివారం రాత్రి చెన్నైలోని కామరాజర్ అరంగంలో తమిళ అభ్యుదయ రచయితల సంఘం, ద్రవిడ కళగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ‘సనాతన ధర్మ నిర్మూలనా మహానాడు’లో పాల్గొన్న ఉదయనిధి మాట్లాడారు. దీనిపై బీజేపీ సహా పలు హిందూ సంస్థలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. జాతి నిర్మూలనకు ఉదయనిధి పిలుపునిచ్చారంటూ డీఎంకే భాగస్వామిగా ఉన్న 'ఇండియా' కమిటీపై సైతం విమర్శలు గుప్పించాయి.
కాంగ్రెస్ ముక్త భారత్ అర్ధం కూడా అదేనా?
సనాతన ధర్మాన్ని తాను విమర్శించడం, సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అనడం వాస్తవమేనని ఉదయనిధి ఒప్పుకున్నారు. ఈమాట మళ్లీమళ్లీ తాను చెబుతానని, అయితే కొందరు తాను జాతి హననాన్ని స్వాగతిస్తున్నానంటూ ఏవోవే మాట్లాడుతున్నారని, మరికొందరైతే ద్రవిడాన్ని రద్దు చేయాలని మాట్లాడుతున్నారని అన్నారు. అంటే డీఎంకే వారిని చంపేయమని అర్ధమా? అని ప్రశ్నించారు. 'కాంగ్రెస్ ముక్త భారత్' అని మోదీ అంటుంటారని, అంటే కాంగ్రెస్ వాళ్లను చంపేయమని అర్ధమా? అని ఉదయనిధి ఎదురుదాడి చేశారు.
''ద్రవిడ మోడల్ మార్పునకు పిలుపునిస్తుంది. అంతా సమానమేనని చెబుతుంది. బీజేపీ నా మాటలను ట్విస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తోంది. అది వాళ్లకు షరామామూలే. వాళ్లు నా మీద ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియా బ్లాక్‌నూ చూసి బీజేపీకి భయం పట్టుకుంది. అందుకే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోంది. వన్ క్లాన్, వన్ గాడ్ అనేది డీఎంకే విధానం'' అని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. సనాతన ధర్మాన్ని అవలంభించేవారిని నరమేథం చేయాలని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. అణగారిన వర్గాల తరఫున తాను మాట్లాడుతూ, సతానన ధర్మం వల్ల వారంతా బాధితులని తాను చెప్పినట్టు తెలిపారు. కులం, మతం పేరుతో ప్రజలను సనాతన ధర్మం విడదీస్తోందని, మానవత్వాన్ని పాదుకొలపడం, సమానత్వం సాధించడం కోసం సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు.