Asaduddin Owaisi: ముస్లింలకు అనుమతి ఇచ్చేందుకు ఆయన ఎవరు?.. ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌ఫై ఫైర్
ABN , First Publish Date - 2023-01-11T15:20:47+05:30 IST
ముస్లింలకు భారతదేశంలో ఎలాంటి ముప్పు లేదని, వారు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై...
న్యూఢిల్లీ: ముస్లింలకు భారతదేశంలో ఎలాంటి ముప్పు లేదని, వారు తమ ఆధిపత్య ధోరణిని విడనాడాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలు భారతదేశంలో నివసించడానికి, తమ విశ్వాసాలను అనుసరించడానికి అనుమతి ఇవ్వడానికి మోహన్ భగవత్ ఎవరని ప్రశ్నించారు. ''అల్లా కోరుకున్నందు వల్ల మనం భారతీయులమయ్యాం. మన పౌరసత్వంపై షరతులు పెట్టేందుకు ఆయనకు ఎంత ధైర్యం?. నాగపూర్‌లో ఉండే బ్రహ్మచారుల కోసం మా విశ్వాసాలను మార్చుకునేందుకు మేము ఇక్కడ లేము'' అని ఒవైసీ అన్నారు.
ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ భారతదేశ భవిష్యత్తుకు ముప్పు అని, అంతర్గత శత్రువులు ఎవరనేది త్వరలోనే భారతీయులు గుర్తిస్తారని అసదుద్దీన్ అన్నారు. సభ్య సమాజం మతం పేరుతో ఇలాంటి విద్వేషాన్ని సహించదని చెప్పారు. ''హిందువుల ప్రతినిధిగా మోహన్ భగవత్‌ను ఎవరు ఎన్నుకున్నారు? 2024 ఎన్నికల్లో పోటీని స్వాగతిస్తాం'' అని ఒవైసీ అన్నారు. ఆర్ఎస్ఎస్ అధిపత్యాన్ని నమ్మే హిందువులు చాలా మంది ఉన్నారు. ప్రతి మైనారిటీ ఏమనుకుంటున్నాడో ఒదిలేయండి. సొంత దేశంలోనే మీరు విభజన బీజాలు నాటుతూ వశుధైక కుటుంబం అంటూ ప్రపంచనానికి ఎలా చెప్పుకుంటారు? అని ఆయన నిలదీశారు. ఇతర దేశాల్లో ముస్లిం నేతలను కౌగిలించుకునే ప్రధాని మోదీ సొంత దేశంలో ముస్లింలను ఎందుకు కౌగిలించుకోరని ప్రశ్నించారు.