China : భారత్ సరిహద్దుల్లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతపై జీ జిన్‌పింగ్ తనిఖీ

ABN , First Publish Date - 2023-01-20T19:27:16+05:30 IST

భారత్-చైనా సరిహద్దుల్లో తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్

China : భారత్ సరిహద్దుల్లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతపై జీ జిన్‌పింగ్ తనిఖీ
Xi Jinping China

బీజింగ్ : భారత్-చైనా సరిహద్దుల్లో తూర్పు లడఖ్‌లో చైనా సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) తనిఖీ చేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA) ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం ఈ వివరాలను తెలిపింది.

చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ, పీఎల్ఏ కమాండర్ ఇన్ చీఫ్‌గానూ జీ జిన్‌పింగ్ వ్యవహరిస్తున్నారు. చైనా ప్రభుత్వ మీడియా పోస్ట్ చేసిన వీడియో ద్వారా వెల్లడవుతున్న అంశాలనుబట్టి, కొన్ని సంవత్సరాలుగా ఈ ఏరియా నిరంతరం ఎలా మారుతోందో జిన్‌పింగ్ సైన్యానికి వివరించారు. దీని ప్రభావం సైన్యంపై ఏవిధంగా ఉందో కూడా ఆయన చెప్పారు.

సైనికుల యుద్ధ సన్నద్ధతను జీ జిన్‌పింగ్ తనిఖీ చేశారని చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఓ సైనికుడు ఆయనతో మాట్లాడుతూ, తాము ఇప్పుడు సరిహద్దులో డైనమిక్, 24 గంటల పర్యవేక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపాడని పేర్కొంది. ప్రతికూల ప్రాంతం కాబట్టి తాజా కూరగాయలు అందుతున్నాయా? అని జిన్‌పింగ్ అడిగారని తెలిపింది. సరిహద్దు రక్షణలో ఆదర్శప్రాయులని సైనికులను ఆయన ప్రశంసించారని తెలిపింది. పట్టుదలతో పని చేయాలని, మరిన్ని సేవలు అందించాలని ప్రోత్సహించారని తెలిపింది.

భారత్-చైనా ఘర్షణ ప్రాంతం

భారత్-చైనా మధ్య ఘర్షణ తూర్పు లడఖ్‌లో 2020 మే నుంచి కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో హింసాత్మక సంఘటన కూడా జరిగింది. ఇప్పటి వరకు 17సార్లు అత్యున్నత స్థాయి మిలిటరీ లెవెల్ చర్చలు జరిగాయి. కానీ చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు అభివృద్ధి చెందాలంటే వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరి అని భారత దేశం చెప్తోంది.

Updated Date - 2023-01-20T19:27:22+05:30 IST