30 Day No Sugar: ఒక నెల రోజులు చక్కెరకు దూరంగా ఉంటే జరిగేది ఇది.. గుండెకు ఏమౌతుందంటే..
ABN , First Publish Date - 2023-02-15T12:43:17+05:30 IST
మన రోజువారి ఆహారంలో చక్కెరలేకుండా ఏది తినలేం.
ఉదయాన్నే కమ్మని కాఫీ గొంతులో పడకపోతే ఆరోజంతా ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. ఇది ఇప్పటి అలవాటైతే కాదు. తీయని జాంగీర్, పాలకోవా, కమ్మని నేతి మైసుర్ పాక్ ఏది తిన్నా అందులో తీపిని ఎంజాయ్ చేస్తాం. అలా తరతరాలుగా తీపికి అలవాటు పడిపోయిన దేహాలు ఒక్కసారిగా తీపిని, అదే చక్కెరను పక్కన పెట్టి ఆలోచించడం ఎంత కష్టం. మన రోజువారి ఆహారంలో చక్కెరలేకుండా ఏది తినలేం. ఇదంతా మధుమేహం ఉన్నవారికి అలవాటేమోకానీ మామూలు జనాలు తీపిని అంత త్వరగా వదులుకోలేరు. అసలు పంచదారను ఓ నెలపాటు వదిలేస్తే.. ఇది మన ఆరోగ్యాన్ని ఎంత వరకూ సపోర్ట్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం.
అనేక విధాలుగా, మనం తీసుకునే ఆహారం చక్కెరతో నిండి ఉంటుంది. డెజర్ట్‌లు, పానీయాలు, కార్బోనేటేడ్ పానీయాలు, పండ్లలో కూడా చక్కెర ఉంటుంది. కొన్ని రకాల చక్కెరలు శరీరానికి అవసరమైనప్పటికీ, శుద్ధి చేసిన చక్కెర అనేక ఆరోగ్య రుగ్మతలకు దారి తీస్తుంది.
అధిక మోతాదులో చక్కెర ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాలరీలను పెంచుతుంది. ఇది త్వరగా శరీరంలో చేరి, బరువు పెరగడానికి దారితీస్తుంది. దీనితో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు వంటి జీవక్రియ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒక నెల పాటు మీ ఆహారం నుండి చక్కెరను తొలగిస్తే ఏం జరుగుతుంది? ఆహారం నుండి చక్కెరను తగ్గించినపుడు శరీర మార్పుల్లో ఒకటి బరువు తగ్గడం. అవును శరీరానికి చక్కెర స్థాయిలు అందకపోతే సరాసరి ఆ ప్రభావం బరువు మీద చూపుతుంది. దీంతో బరువుతగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ మేనేజ్‌మెంట్ దెబ్బతింటుందని, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెప్పేమాట., ఇది రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి దారితీస్తుంది.
చక్కెర తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌లో స్పైక్‌లు, క్రాష్‌లకు కారణమవుతుంది, ఇది అలసట, బద్ధకానికి దారి తీస్తుంది. చక్కెరను తగ్గించడం వల్ల శక్తి స్థాయిలు మరింత స్థిరంగా మారతాయి. రోజంతా మరింత అప్రమత్తంగా, మెలకువగా ఉండేందుకు సహకరిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది, ఎందుకంటే ఇది శరీరంపై మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. శుద్ధి చేసిన చక్కెర వినియోగం గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. చక్కెర అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులకు ఇతర ప్రమాద కారకాలకు ప్రధానంగా దోహదపడుతుంది. చక్కెరను తగ్గించడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.