Vengadampettai: ఆ మునీశ్వరుడి పాదాలు బొబ్బలెక్కాయి.. అక్కడే ఉన్న ఓ పిల్లకాలువలో అడుగుపెట్టగానే..
ABN , First Publish Date - 2023-03-03T12:58:37+05:30 IST
శ్రీరామచంద్రమూర్తి అనంత శయనుడిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం. దాదాపు ఆరుశతాబ్దాల నాటి ఈ ప్రాచీన దేవాలయం మూడు
చెన్నై, ఆంధ్రజ్యోతి: శ్రీరామచంద్రమూర్తి అనంత శయనుడిగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం. దాదాపు ఆరుశతాబ్దాల నాటి ఈ ప్రాచీన దేవాలయం మూడు రూపాల్లో పెరుమాళ్ భక్తులను విశేషంగా అనుగ్రహించే పుణ్యస్థలం. ఇదే వేంగడాంపేట్టైలోని పెరుమాళ్ ఆలయం. ద్వాపర, త్రేతాయుగాలకు సంబంధించి స్థలపురాణాలున్నా... శ్రీరాముడు, వేణుగోపాలస్వామి ఇక్కడ కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు.
కడలూరు జిల్లా కురింజిపాడి సమీపంలో వేంగడాంపేట్టై గ్రామంలోని దివ్యక్షేత్రంలో పెరుమాళ్ ఆశీన, శయన, అర్చా భంగిమల్లో భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రంలోని అత్యంత ప్రాచీనమైన ఆలయంలో వేణుగోపాలస్వామి కొలువుదీరి ఉన్నారు. సుమారు ఆరు శతాబ్దాల నాటి ప్రాచీన ఆలయమని చరిత్రకారులు చెబుతున్నారు. విజయనగర రాజులు ఈ ఆలయానికి జీర్ణోద్ధరణ నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. క్రీ.శ. 1464లో సెంజి ప్రాంతాన్ని పరిపాలించిన వేంకటపతి నాయకర్ అనే రాజు తన సోదరి వెంకటమ్మాళ్ పేరిట ఈ గ్రామాన్ని రూపొందించారు. ప్రారంభంలో వేంకటమ్మాళ్‌పేట అని పిలువబడిన ఈ ఊరు కాలగమనంలో వేంగడాంపేట్టైగా మారింది. అలంకార ప్రియుడైన తిరుమాళ్ తనను వివిధ రకాల అలంకారాలతో, తులసిమాలలతో ఆరాధించే భక్తుల వరాలు తీరుస్తారు. ఆ విధంగా తనను ఆరాధించి తపమాచరించిన షడమర్‌షణర్ అనే మునీశ్వరుడికి దర్శనిమిచ్చిన దివ్యక్షేత్రమే ఈ వేంగడాంపేట్టై. తదుపరి కాలంలోనే అక్కడ వేణుగోపాలస్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు.
స్థలపురాణం...
రామాయణ కాలంలో అరణ్యవాసం సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించుకెళ్లడంతో శోకతప్తుడైన శ్రీరాముడు భార్యను అన్వేషిస్తూ హరితవనాలతో పచ్చగా కళకళలాడుతున్న ఈ ప్రాంతాన్ని చూసిముగ్థులయ్యారు. సతీవియోగంతో బాధపడుతున్న శ్రీరాముడు ఈ ప్రాంతంలో ఓ రోజంతా బసచేసి సేదతీరారు. రావణాసురుడి వధ అనంతరం అయోధ్యకు తిరిగి వెళ్తున్నప్పుడు కూడా సీతా, లక్ష్మణ, ఆంజనేయసమేతుడై రాముడు ఓ రోజు బసచేశారు. ఆ సమయంలో ఆదిశేషుడిపై పవళించిన మహావిష్ణువులా శ్రీరామచంద్రుడు శయనించటంతో ఈ స్థలం దివ్యక్షేత్రంగా మారింది. ఇదిలా ఉండగా పూర్వంలో కొన్ని సమస్యల కారణంగా చిదంబరంలోని రంగనాథస్వామివారి విగ్రహం కడలిలో కొట్టుకుపోయింది. దీంతో థిల్లై తిరుచిత్రకూటం ఆ విగ్రహం లేక బోసిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతానికి చెందిన రాజు ప్రాంతక చోళుడు భక్తుల కోరిక ప్రకారం 18 అడుగుల శ్రీరంగనాథస్వామి విగ్రహాన్ని తయారు చేయించారు. అయితే అంత ఎత్తు కలిగిన ఆ విగ్రహాన్ని చిదంబరంలో ప్రతిష్ఠించడాన్ని స్థానికులు వ్యతిరేకించారు.
చివరకు శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాస సమయంలో రెండు రాత్రులు బసచేసిన, ఆయనకు బాగా నచ్చిన తీర్థవనం (వేంగడాంపేట్టై)లో ఆ విగ్రహాన్ని ‘అనంత శయన రాముడు’ అనే పేరిట ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి చిదంబరం ఆలయం లాగే వేంగడాంపేట్టై ప్రసిద్ధి చెందింది. కాలక్రమంలో ఇక్కడి భక్తులంతా కలిసి చిదంబరంలో నటరాజస్వామివారిలా ఈ ఆలయంలో పిల్లనగ్రోవి ఊదుతూ ఒంటికాలిపై నిలిచిన భంగిమలో ఆరడుగుల వేణుగోపాలస్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహమే ఆలయంలో మూలవిరాట్టుగా నిత్యపూజలందుకుంటోంది.
మరో గాథ...
ఈ ఆలయానికి మరొక స్థల పురాణం కూడా ఉంది. ద్వాపరయుగం పరిసమాప్తమై కలియుగం ప్రారంభం కావటంతో కలిపురుషుడి ప్రభావం నుంచి ప్రజలను కాపాడి అందరిలో శాంతి నెలకొల్పేందుకు షడ్మర్‌షణర్ అనే మునీశ్వరుడు దక్షిణ భారతదేశంలో తీర్థయాత్ర చేశారు. దక్షిణ పెన్నా తీరంలో నడచివెళ్తుండగా ఇసుకవేడికి ఆ మునీశ్వరుడి పాదాలు బొబ్బలెక్కాయి. అక్కడే ఉన్న ఓ పిల్లకాలువలో అడుగుపెట్టడంతో కాలిబొబ్బలు మాయమయ్యాయి. దీంతో ఆ మునీశ్వరుడు ఆ కాలువ వెంటే నడిచి తీర్థవనం అనే వేంగడాంపేట్టై చేరుకున్నారు. అక్కడ పెరుమాళ్ అనుగ్రహం కోసం తపమాచగా పెరుమాళ్ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు. ఆ మునీశ్వరుడు ఏ వరాలు అవసరం లేదని, తనకు దశావతారాలను చూపించమని కోరారు. ఆ ప్రకారమే పెరుమాళ్ తన దశావతారాలతో దర్శనమిచ్చారు. ఆ తర్వాత మునీశ్వరుడు ఈ ప్రాంతంలో శయనభంగిమలో శ్రీరామచంద్రమూర్తి రూపంలో ఆవిర్భవించి భక్తులను అనుగ్రహించాలని కోరగా, స్వామివారు అప్పటి నుంచి ఇక్కడి ఆలయంలో వేంకటాచలపతి స్వామిగా ఆశీన, శయన, అర్చా (నిలిచిన రూపం) భంగిమలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఆలయ వైభవం...
నల్ల రాతితో నిర్మితమైన ప్రహరీలతో 236 అడుగుల పొడవు, 129 అడుగుల వెడల్పు కలిగిన ఈ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఆలయ ప్రవేశంలో ఏడంతస్థులు కలిగిన రాజగోపురం దర్శనమిస్తుంది. ఆలయం ఎదురుగా 50 అడుగుల నల్లరాతితో నిర్మితమైన ఊంజల్ మండపం ఉంది. ఆ మండపానికి చేరువలోనే గజమండపం, రథ మండపం ఉన్నాయి. ఎకరా విస్తీర్ణం కలిగిన ఏడు బావులతో కూడిన ఆలయ తీర్థ కొలను కూడా ఉంది. మోహినీ అవతార రూపంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. వేణుగోపాలస్వామివారి సన్నిధికి దక్షిణ దిశగా సెంగమలవళ్లి తాయార్ ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తున్నారు. ఉత్తరదిశగా ఆండాళ్ సన్నిధి ఉంది.
ఆలయ విశేషాలు...
ఈ ఆలయంలో ప్రతియేటా తమిళమాసం ఆవణి నెల 25 నుంచి ఆరు రోజులపాటు సూర్యపూజోత్సవాలు జరుగుతాయి. ఆ ఆరు రోజులూ ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకు గర్భాలయంలోని మూలవిరాట్టు పాదాలపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి. ఇదే విధంగా పురటాసి పౌర్ణమికి ముందు మూడు రోజులు, పౌర్ణమి తరువాత మూడు రోజులు ఈ మూలవిరాట్టుపై చంద్రుడి కిరణాలు ప్రసరిస్తాయి. ఇలా సూర్యచంద్రులు పెరుమాళ్‌ను ఆరాధించే దివ్యక్షేత్రంగా ఈ ఆలయం ఖ్యాతిగడించింది. కార్తీకపౌర్ణమి, వైకుంఠ ఏకాదశి, ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కడలూరు జిల్లా కురింజిపాడి నుంచి పన్రుట్టికి వెళ్లే రహదారిలో పది కిలోమీటర్ల దూరంలో, వడలూరుకు 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. వేంగడాంపేట్టై వేణుగోపాలస్వామివారి ఆలయానికి వెళ్లేందుకు కురింజిపాడి, పన్రుట్టి, వడలూరు నుండి బస్సు, ఆటో సదుపాయాలు ఉన్నాయి. ఉదయం ఏడుగంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.