UAE: 13 మంది భారతీయుల నిర్వాకం.. అబుదాబి కోర్టు తీర్పు ఇదీ..!
ABN , First Publish Date - 2023-05-19T12:24:35+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 13 మంది భారతీయులను అబుదాబి న్యాయస్థానం మనీలాండరింగ్, పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) 13 మంది భారతీయులను అబుదాబి న్యాయస్థానం మనీలాండరింగ్ (Money laundering), పన్నుల ఎగవేతకు పాల్పడినట్టు నిర్ధారించింది. వారికి సంబంధించిన ఏడు కంపెనీల ద్వారా భారీ మొత్తంలో మోసానికి పాల్పడ్డారని నిర్ధారించిన అబుదాబి క్రిమినల్ కోర్టు నలుగురు నిందితులకు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే వారి శిక్షకాలం పూర్తైన వెంటనే దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది. అంతేగాక నిందితులు 5 మిలియన్ల నుంచి 10 మిలియన్ల వరకు ఫైన్ చెల్లించాలని తెలిపింది. కాగా, నిందితులు లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు పాయింట్ ఆఫ్ సెల్(points of sale) ద్వారా 510 మిలియన్ దిర్హమ్ల విలువైన క్రెడిట్ సౌకర్యాలను దుర్వినియోగం చేసినట్లు అబుదాబి అధికారులు తెలిపారు.
ఇక ఈ 13 మంది సభ్యుల ముఠా ఒక 'క్రిమినల్ ఆర్గనైజేషన్'ను నెలకొల్పినట్లు ఈ సందర్భంగా అబుదాబి (Abu Dahbi) అధికారులు అభిప్రాయపడ్డారు. లైసెన్స్ లేని ఆర్థిక లావాదేవీల కోసం ట్రావెల్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని ఉపయోగించిందని నేర పరిశోధకులు గుర్తించారు. దీని ద్వారా వారు భారీ మొత్తంలో సంపాదించినట్లు తేలింది. వారి నేరాలను రుజువు చేసేలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూనిట్ (Financial Information Unit) జారీ చేసిన బ్యాంక్ లావాదేవీ నివేదికలు, ఆర్థిక విశ్లేషణ స్టేట్‌మెంట్స్‌ను కూడా ఈ సందర్భంగా అధికారులు న్యాయస్థానం ముందు ఉంచారు.