Indian Student: కెనడాలో ఘోరం.. అందరూ చూస్తుండగా భారతీయ విద్యార్ధిపై దాడి.. నడిరోడ్డుపై దారుణంగా కొట్టి ఆపై..!
ABN , First Publish Date - 2023-03-21T11:16:44+05:30 IST
కెనడాలో (Canada) దారుణం జరిగింది. భారత్‌కు చెందిన ఓ సిక్కు విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని దుండగులు జాత్యహంకార దాడికి పాల్పడ్డారు.
ఎన్నారై డెస్క్: కెనడాలో (Canada) దారుణం జరిగింది. భారత్‌కు చెందిన ఓ సిక్కు విద్యార్థిపై కొందరు గుర్తు తెలియని దుండగులు జాత్యహంకార దాడికి పాల్పడ్డారు. బ్రిటీష్ కొలంబియాలో (British Columbia) ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు విద్యార్ధి తలపాగాను చింపి (Turban Ripped Off), రోడ్డుపై కొట్టిపారేశారు. బాధితుడిని గగన్‌దీప్ సింగ్‌గా(Gagandeep Singh) గుర్తించారు. గత శుక్రవారం రాత్రి కిరాణ సామాన్లు కొనుగోలు చేసి, బస్సులో తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో అతనిపై దుండగులు ఒక్కసారిగా విరుచుకుపడినట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక కౌన్సిలర్ మోహినీ సింగ్ ( Mohini Singh) మాట్లాడుతూ.. దాడి జరిగిన విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయినట్లు తెలిపారు. గగన్‌దీప్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లగా.. ఆ పరిస్ధితుల్లో అతడిని చూసి తనకు భయం వేసిందని ఆయన పేర్కొన్నారు.
గగన్‌దీప్ కనీసం నోరు కూడా తెరవలేకపోయాడని మోహినీ సింగ్ అన్నారు. అతడి ముఖంపై తీవ్రంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయన్నారు. యువకుడి కళ్లు వాచిపోయి ఉన్నాయని, తీవ్ర గాయాలతో బాధపడుతున్నాడని ఆమె చెప్పారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో కిరాణా సామాగ్రి కొనుగోలు చేసి బస్సులో ఇంటికి వెళ్తుండగా.. 12 నుంచి 15 మంది యువకులు గగన్‌దీప్‌పై మూకుమ్మడిగా దాడికి పాల్పడినట్లు తనతో చెప్పాడని మోహినీ తెలిపారు. ఆ మూకల గుంపు తనకు ఇబ్బంది పెట్టడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పాడు. దాంతో ఆ గుంపు ఇంక రెచ్చిపోయినట్లు గగన్‌దీప్ చెప్పాడట. వారి వేధింపులు ఎక్కువ కావడంతో అతడు మధ్యలోనే బస్సు దిగిపోయాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్న అతడిపై దుండగుల గుంపు కూడా బస్సు దిగి చుట్టుముట్టింది. ఆ తర్వాత వారంతా కలిసి మూకుమ్మడిగా అతనిపై దాడి చేశారు. నడిరోడ్డుపై తీవ్రంగా కొట్టారు.
ఇది కూడా చదవండి: ఆసియాలోనే అతిపెద్ద అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం.. ఇకపై వీసాల కోసం వేచి ఉండే అవస్థలకు చెక్!
అంతటితో ఆగకుండా అతని తలపాగాను కూడా చింపేసి, రోడ్డు మీదకు తోశారు. ఈ ఘటనలో గగన్‌దీప్ ముఖం, పక్కటెముకలు, చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. స్పృహతప్పి పడిపోయిన గగన్‌దీప్ కొద్దిసేపటి తర్వాత తేరుకుని తన మిత్రుడికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి 911కి సమాచారం అందించారు. ఇక గగన్‌దీప్‌పై ఈ దాడితో అతని స్నేహితులు, అంతర్జాతీయ విద్యార్ధులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని మోహినీ సింగ్ చెప్పారు. ఇది ఖచ్చితంగా జాత్యహంకార దాడేనని (Racist Attack) ఆమె అన్నారు. ఈ ఘటనపై కెలోవ్నా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (Royal Canadian Mounted Police) దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను స్థానిక ఇండియన్ కమ్యూనిటీ కూడా తీవ్రంగా ఖండించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని భారతీయ సమాజం ప్రతినిధులు అన్నారు.
ఇది కూడా చదవండి: నారింజ పండ్లు ఎంత పనిచేశాయి.. సౌదీలో తెలుగు ఎన్నారైకి ఊహించని అనుభవం.. అటు ఉన్న ఉద్యోగం ఊడి.. ఇటు స్వదేశానికి రాలేని పరిస్థితి..!