Sudan Violence: సూడాన్‌లో చిక్కుకున్న 31 మంది భారతీయులు.. రక్షించేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం

ABN , First Publish Date - 2023-04-19T08:03:24+05:30 IST

సూడాన్‌లో సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న 31 మంది కర్ణాటక సంచార జాతుల వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్‌ మనోజ్‌ రంజన్‌ వెల్లడించారు.

Sudan Violence: సూడాన్‌లో చిక్కుకున్న 31 మంది భారతీయులు.. రక్షించేందుకు కేంద్రం చర్యలు ముమ్మరం

బెంగళూరు, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): సూడాన్‌లో సైన్యానికి, పారా మిలిటరీ దళాలకు జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న 31 మంది కర్ణాటక సంచార జాతుల వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కమిషనర్‌ మనోజ్‌ రంజన్‌ వెల్లడించారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సూడాన్‌లో చిక్కుకున్న భారతీయులందరినీ రక్షించేందుకు కేంద్రప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోందని, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖతోనూ, సూడాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయంతోనూ సంప్రతిస్తోందని అన్నారు. ఉపాధి నిమిత్తం కర్ణాటకకు చెందిన వందలాదిమంది సంచార జాతుల వాసులు ఆఫ్రికా దేశాలకు తరలివెళ్లారని, వీరిలో 31 మంది అక్కడి ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని సురక్షితంగా కర్ణాటకకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతకుముందు, సూడాన్‌లో చిక్కుకున్న కన్నడిగులను రక్షించాలని కర్ణాటక ప్రతిపక్షనేత సిద్దరామయ్య కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-04-19T08:03:24+05:30 IST