NRI: ఆరు గల్ఫ్ దేశాల్లో 88.8లక్షల మంది భారత ప్రవాసులు.. అత్యధికం మాత్రం ఆ దేశంలోనే..
ABN , First Publish Date - 2023-08-01T08:20:39+05:30 IST
ప్రవాస భారతీయుల్లో (Non Resident Indians) 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే.
ఎన్నారై డెస్క్: ప్రవాస భారతీయుల్లో (Non Resident Indians) 66 శాతం మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ ఇటీవల వెల్లడించిన విషయం విదితమే. మొత్తంగా 210 దేశాల్లో 1.34 కోట్ల మంది ప్రవాసీలు ఉన్నారని, వారిలో 88.8 లక్షల మంది ఆరు గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారని వివరించింది. నాగ్‌పూర్‌కు చెందిన అభయ్ కోలార్కర్ ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రిత్వశాఖ ఈ వివరాలు తెలియజేసింది. ఇక 88.8 లక్షల్లో అత్యధికంగా మాత్రం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉంటున్నారని పేర్కొంది. ఆ దేశంలో ఏకంగా 34.1లక్షల మంది నివాసం ఉంటున్నారు.
ఆ తర్వాత వరుసగా సౌదీ అరేబియా (25.9లక్షలు), కువైత్ (10.2లక్షలు), ఒమాన్ (7.7లక్షలు), ఖతార్ (7.4లక్షలు), బహ్రెయిన్ (3.3లక్షలు) ఉన్నారు. అమెరికాలో ఎన్‌ఆర్‌ఐల సంఖ్య కన్నా పీఐఓల సంఖ్య అధికంగా ఉండడం విశేషం. అగ్రరాజ్యంలో ఎన్నారైల సంఖ్య 12.8 లక్షల మంది కాగా పీఐఓల సంఖ్య 31 లక్షలు. పీఐఓల్లో అమెరికా తరువాత స్థానాల్లో మలేసియా (27.6 లక్షలు), మయన్మార్ (20 లక్షలు), శ్రీలంక (16 లక్షలు), కెనడా (15.1 లక్షలు) ఉన్నారు. ఇక యూఎస్ తర్వాత ఎన్నారైలు అధిక సంఖ్యలో ఉంటున్న దేశాల విషయానికి వస్తే.. యూకే (3.5లక్షలు), ఆస్ట్రేలియా (2.4లక్షలు), మలేసియా (2.2లక్షలు), కెనడా (1.7లక్షలు) ఉన్నాయి.