Share News

Saudi Arabia: పెట్రోల్ బంకుల్లో కఠిన నిబంధనలు.. పాటించకపోతే రూ.5.54లక్షల వరకు జరిమానా!

ABN , First Publish Date - 2023-10-18T08:44:03+05:30 IST

గల్ఫ్ దేశాలలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఆ దేశాలలో అన్ని విషయాలు చాలా పకడ్బందీగా జరుగుతుంటాయి.

Saudi Arabia: పెట్రోల్ బంకుల్లో కఠిన నిబంధనలు.. పాటించకపోతే రూ.5.54లక్షల వరకు జరిమానా!

జెడ్డా: గల్ఫ్ దేశాలలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయనే విషయం తెలిసిందే. అందుకే ఆ దేశాలలో అన్ని విషయాలు చాలా పకడ్బందీగా జరుగుతుంటాయి. అక్కడ నివాసం ఉండేవారు కూడా ఎక్కడ ఎలాంటి పొరపాటు, నిర్లక్ష్యం, ఉదాసీనతగా ఉండరు. పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఒకవేళ పరిసరాల విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన అక్కడి చట్టాల ప్రకారం భారీ జరిమానాలు, ఆఖరికి జైలుకు సైతం వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా సౌదీ మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Municipal, Rural Affairs and Housing) అక్కడి పెట్రోల్ బంకుల నిర్వాహణ విషయంలో యజమానులు పాటించాల్సిన నియమనిబంధనలను మరోసారి గుర్తు చేసింది. ప్రధానంగా టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంలో విఫలమైన పెట్రోల్ బంకులకు (Petrol stations) కనీసం 2,500 రియాల్స్ (సుమారు రూ.55వేలు) జరిమానా విధించడం ప్రారంభించింది. అలాగే వివిధ ఉల్లంఘనలకు 25వేల రియాల్స్ (రూ.5.54లక్షలు) వరకు జరిమానా విధించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వేర్వేరు ఉల్లంఘనల ఆధారంగా ప్రత్యేకించి కొన్ని నియంత్రణ ప్రమాణాలతో గ్యాస్ స్టేషన్ల విషయంలో మంత్రిత్వ శాఖ జరిమానాలు విధిస్తుంది.

మున్సిపల్ చట్టం (Municipal Law) ప్రకారం పెట్రోల్ బంకు పరిసరాల్లో మసీదు (Mosque) లేకుంటే 5,000 రియాల్స్ (రూ. 1.10లక్షలు) జరిమానా విధిస్తారు. ఒకవేళ ప్రస్తుతం మసీదు లేకుంటే కొత్త మసీదును నిర్మించడం ద్వారా పెట్రోల్ స్టేషన్లు ఈ ఉల్లంఘనను పరిష్కరించుకోవచ్చు. అలాగే కాఫీ షాపులు (Coffee Shops) నిర్వహించకపోయినా 5,000 రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. పెట్రోలు బంకుల్లో టైర్ల దుకాణాలు లేకుంటే 1,000 నుండి 5,000 రియాల్స్ వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే టాయిలెట్‌లో నీటి లీకేజీ లేదా శుభ్రత లోపిస్తే 2,500 రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. పెట్రోలు బంకుల్లో వ్యర్థాలను పారవేసేందుకు కంటైనర్లు లేకున్నా, నేల మురికిగా ఉన్నా 2,500 రియాళ్ల వరకు జరిమానా కట్టాల్సిందే. అన్ని పెట్రోల్ బంకుల్లో నాణ్యమైన సర్వీస్, పరిశుభ్రత ఉండేలా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజలకు మెరుగైన, పరిశుభ్రమైన సేవలను అందించడానికి మరియు జరిమానాలను నివారించడానికి ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ పెట్రోల్ బంకుల యజమానులను ఆదేశించింది.

NRI: యూఎస్ బిగ్‌టెక్ తొలగింపులలో భారత హెచ్-1బీ వర్కర్లకు తీవ్ర అన్యాయం.. ఎన్నారైల గగ్గొలు


Updated Date - 2023-10-18T08:44:03+05:30 IST