WhatsApp: ఎల్లలు దాటిన వాట్సాప్ సందేశం.. ఆఫ్రికాలో ఉన్న తండ్రికి తెలుగునాట తప్పిపోయిన బిడ్డ ఆచూకీ తెలిసిందిలా..
ABN , First Publish Date - 2023-05-21T07:41:45+05:30 IST
సామాజిక మాధ్యమాల విస్తృత వినియోగం వలన అనేక దుష్ప్రభావాలు కల్గుతున్న కొన్ని సార్లు దాని వలన సమాజానికి ఎనలేని ప్రయోజనం కూడా కల్గుతుంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సామాజిక మాధ్యమాల విస్తృత వినియోగం వలన అనేక దుష్ప్రభావాలు కల్గుతున్న కొన్ని సార్లు దాని వలన సమాజానికి ఎనలేని ప్రయోజనం కూడా కల్గుతుంది. మాతృభూమిలో మంచికి చెడుకు ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, కలిసి కలువని టెలిఫోన్ లైన్లపై ఆధారపడ్డ ప్రవాసీయులకు సామాజిక మాధ్యమాలు చాలా వరకు ఉపకరిస్తున్నాయి. ఒక కుగ్రామంలో సెల్ ఫోన్ ద్వారా సామాజిక మాధ్యమంలో ఇచ్చిన ఒక సమాచారం కరోనా మహమ్మారి కారణాన విఛిన్నమైన ఒక ప్రవాసీ కుటుంబాన్ని ఆదుకుంది. తప్పిపోయిన తన కూతురు కోసం రెండేళ్లుగా విదేశీ గడ్డపై ఎదురు చూస్తున్న ఒక తండ్రికి బిడ్డ ఆచూకీ లభించింది.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రవిచంద్ర.. నైజీరియాలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన కుటుంబం విశాఖపట్టణంలో నివసిస్తుంది. 2021 జూన్‌లో ఆయన భార్య కోవిడ్‌తో మరణించగా ప్రయాణ ఆంక్షల కారణాన ఆయన భార్య చివరి చూపులకు కూడా నోచుకోలేకపోయారు. ఇద్దరు పిల్లలు హస్య(9), మధు(11) తాత్కలికంగా తమ తాత, అమ్మమ్మల వద్దకు వెళ్ళగా వారు హైద్రాబాద్‌కు మకాం మారారు. వారు హైద్రాబాద్‌లో కొద్ది కాలానికి తమ దూరపు బంధువైన ఆండాళ్ళకు హాస్యను అప్పగించగా ఆమె ఆ తర్వాత కొద్ది కాలానికి తనకు తెలిసిన కరీంనగర్ జిల్లాకు చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళకు పాపను ఇచ్చింది. భాగ్యలక్ష్మి అత్యవసర పని కొరకు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి రాగా హైద్రాబాద్ నుండి హాస్య కూడా ఆమె వెంట వచ్చింది. భాగ్యలక్ష్మి బంధువయిన లచ్చవ్వ హాస్యను తీసుకోని ఎగ్లాస్పూర్ అనే గ్రామానికి వెళ్ళింది. బాలిక భాష, యాసను గమనించిన స్ధానిక సర్పంచ్ కె. రాజరెడ్డి బాలిక ఫొటో, సమాచారాన్ని తెలియజేస్తూ ఒక పోస్ట్ చేశారు. అందులో సైదాపూర్ యస్ఐ ఫోన్ నెంబర్‌ను పేర్కొన్నారు.
Swastika symbol: 'స్వస్తిక్' గుర్తు తెచ్చిన తంటా.. సౌదీలో కటకటాల వెనక్కి తెలుగోడు..!
తెలంగాణలోని ఒక కుగ్రామంలో వాట్సాప్‌లో చేసిన ఈ పోస్టు కొద్ది రోజులలో ఖండంతరాలు దాటి ఆఫ్రీకాలోని నైజీరియాలోని తండ్రి రవిచంద్రకు చేరుకుంది. అతడు సబ్ ఇన్స్పెక్టర్ జె. ఆరోగ్యంతో మాట్లాడి విషయాన్ని నిర్ధారణ చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు.తన రెండెళ్ల వ్యధకు వాట్సాప్ మెసెజ్‌తో అంతమైందని రవిచంద్ర పేర్కొన్నారు. తన బిడ్డను పొందడానికి కొన్ని అధికారిక లాంఛనాలు పూర్తి చేయవల్సి ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత తన పాప తనకు దక్కుతుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇక తప్పిపోయిన కూతురు కోసం ఎక్కడో దూరాన ఉన్న ఆఫ్రికా నుండి ఒక తండ్రి వాకాబు చేసి, మాతృదేశానికి తిరిగి వచ్చి పాపను తీసుకోవడమనేది తన సర్వీసులో ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ మంచి సంఘటన అని సైదాపూర్ యస్ఐ జె. ఆరోగ్యం తెలిపారు.
Telugu Techie Mysterious Death: అగ్రరాజ్యంలో ఘోరం.. ఆఫీస్‌కు వెళ్లి అదృశ్యమైన తెలుగు యువతి.. పక్క రాష్ట్రంలో శవంగా కనిపించింది!