UAE: ప్రవాసులూ బీ కేర్‌ఫుల్.. యూఏఈలో ఆ తప్పుకు రూ.2కోట్లకు పైగానే జరిమానా..!
ABN , First Publish Date - 2023-09-06T09:24:59+05:30 IST
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నకిలీ వస్తువుల కట్టడికి చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) నకిలీ వస్తువుల కట్టడికి చర్యలు చేపట్టింది. దేశ సరిహద్దుల గుండా నకిలీ వస్తువులు రాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా కఠిన చట్టాలను అమలు చేస్తోంది. దేశంలో నకిలీ వస్తువులు (Counterfeit goods) విక్రయిస్తూ పట్టుబడిన వారికి భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగంలోని సీనియర్ అధికారి మహమూద్ షకీర్ అల్ మషాదానీ వెల్లడించారు. అలాగే జైలుశిక్ష పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ట్రేడ్‌మార్క్‌లపై 2021లో తీసుకువచ్చిన ఫెడరల్ డిక్రీ లా నం. 36లోని ఆర్టికల్ 49 ప్రకారం 1 మిలియన్ దిర్హమ్స్ (సుమారు రూ.2.26కోట్లు) వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో రెండింటీని విధించే అవకాశం ఉంటుందన్నారు. ఇదిలాఉంటే.. నకిలీ వస్తువుల మార్కెట్ విలువ $2-3 ట్రిలియన్లుగా అంచనా వేయబడిందని, ఇది కంపెనీలు, వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.