Kuwait: టెలిఫోన్ బిల్లులపై ప్రవాసులకు కీలక సూచన.. అలాగే వర్క్ పర్మిట్స్ ఇకపై..
ABN , First Publish Date - 2023-09-06T07:54:17+05:30 IST
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది.
కువైత్ సిటీ: కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) ప్రవాసులకు తాజాగా కీలక సూచన చేసింది. బుధవారం (6వ తేదీ) నుంచి దేశం విడిచి వెళ్లే ప్రవాసులు (Expats) బకాయి ఉన్న టెలిఫోన్ బిల్స్ చెల్లించడం తప్పనిసరి చేసింది. బిల్లు చెల్లించిన తర్వాతే స్వదేశాలకు వెళ్లేందుకు అనుమతించేలా ప్రత్యేక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. సమాచార మంత్రిత్వశాఖ (Ministry of Communication) కు చెందిన అధికారిక వెబ్‌సైట్ లేదా సహేల్ యాప్ (Sahel app) ద్వారా బిల్లులను చెల్లించే ఏర్పాటు చేసింది. అలాగే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులకు ఇంతకుముందు ట్రాఫిక్ జరిమానాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను చెల్లించడం కూడా తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. వర్క్ పర్మిట్ల (Work Permits) విషయంలోనూ కువైత్ సర్కార్ (Kuwait Govt) తాజాగా కీలక మార్పులు చేసింది. 'వర్క్ పర్మిట్ క్యాన్సిలేషన్', 'వర్క్ పర్మిట్ల సవరణ' సర్వీసులను ఇకపై ఆన్‌లైన్‌లో పొందే వెసులుబాటు కల్పించింది. సహేల్ యాప్ ద్వారా కంపెనీలు ఈ ఆన్‌లైన్ సర్వీసులను పొందవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (Public Authority for Manpower) వెల్లడించింది. ఇలా ఆన్‌లైన్‌లో కంపెనీలు వర్క్ పర్మిట్లకు సంబంధించి చేసుకున్న దరఖాస్తులను అధికార యంత్రాంగం సమీక్షించి తదనుగుణంగా అప్‌డేట్ చేస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.