Zombie Drug: అగ్రరాజ్యం అమెరికాలో కలకలం.. 'జాంబీలు'గా మార్చేస్తున్న కొత్త డ్రగ్..!
ABN , First Publish Date - 2023-02-23T11:37:31+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో గతేడాది చివరలో 'జాంబీ వైరస్' (Zombie Virus) పేరిట కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గతేడాది చివరలో 'జాంబీ వైరస్' (Zombie Virus) పేరిట కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియోలలో కొందరు సరిగ్గా నిలబడానికి కూడా ఇబ్బంది పడడం, జాంబీల మాదిరిగా వింతగా ప్రవర్తించడం మనం చూశాం. అయితే, ఇదంతా ఓ కొత్త డ్రగ్ వల్ల వచ్చిందని ఇటీవల పరిశోధకులు నిర్ధారించారు. అదే జాంబీ డ్రగ్ అని పిలువబడే.. ‘జైలజీన్’ (Xylazine). ఈ డ్రగ్ ఓవర్ డోసు కారణంగా ప్రజల శరీర చర్మం కుళ్లిపోయి జాంబీల మాదిరిగా మార్చేస్తుందట. ‘ట్రాంక్ డోప్’గా కూడా పిలువబడే ఈ డ్రగ్.. ఇప్పుడు అగ్రరాజ్యంలోని చాలా నగరాల్లో ప్రజలపై తీవ్ర ప్రభావంతో కలకలం సృష్టిస్తుంది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో ఈ డ్రగ్ కనిపిస్తున్నట్లు ఓ ప్రముఖ న్యూస్ మ్యాగజైన్ తెలియజేసింది. కాగా, ఈ జైలజీన్ అనేది జంతువులకు వినియోగించే మందు. కానీ, దీన్ని కొందరు ఒంటి నొప్పులను తగ్గించుకొనేందుకు అధిక మోతాదులో వినియోగిస్తున్నారట. అలా వినియోగించేవారిలో కొంతకాలం తర్వాత దాన్ని దుష్ప్రభావం తీవ్రంగా ఉంటుందట. చర్మంపై తీవ్ర గాయాలు ఏర్పడి, కుళ్లిపోయి జాంబీల మాదిరిగా మార్చేస్తుంది.
అమెరికాలో మొదటగా ఫిలడెల్ఫియా నగరంలో ఈ డ్రగ్ కనిపించింది. ఆ తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్ నగరాలకు కూడా పాకింది. ఇక జంతువులకు వినియోగించేందుకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(Food and Drug Administration) ఆమోదించిన ఈ జైలజీన్ మానవులకు సురక్షితం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మందు ఓవర్ డోస్ తీసుకొన్న వారికి రివర్స్ చికిత్స కింద ఇచ్చే నాలోక్సోన్‌కు (Naloxone) కూడా స్పందించదని చెబుతున్నారు. ఈ వెటర్నరీ డ్రగ్‌ను తక్కువ ధరకే ఏకంగా వీధుల్లోనే అమ్మేస్తుండటం మరింత ఆందోళనకరమైన అంశమని తెలిపింది. ఫెంటానిల్ మిశ్రమమైన ఈ డ్రగ్ దేశమంతటా వ్యాప్తిచెందితే మాత్రం నష్టం ఊహకు అందదని పరిశోధకులు చెబుతున్నమాట. అమెరికా యువత జీవితాలను నాశనం చేస్తున్న ఈ డ్రగ్‌ను ప్రారంభంలోనే కట్టడి చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భారత్‌కే తొలి ప్రాధాన్యం.. ఈ ఏడాది అధిక వీసాలు భారతీయులకే..!