Georgia Robbery: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. భారత సంతతి యువకుడిని కాల్చి చంపిన ఇద్దరు మైనర్లు..!
ABN , First Publish Date - 2023-07-07T09:21:53+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలోని (America) జార్జియా రాష్ట్రంలో ఘోరం జరిగింది.
ఎన్నారై డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలోని (America) జార్జియా రాష్ట్రంలో ఘోరం జరిగింది. భారత సంతతి యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. సాయుధులైన ఇద్దరు మైనర్లు స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో దోపిడీకి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ స్టోర్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్న 36 ఏళ్ల భారత సంతతి యువకుడు మన్‌దీప్ సింగ్ (Mandeep Singh) వారిని అడ్డుకున్నాడు. దాంతో ఆ ఇద్దరు దుండగులు తమతో పాటు తెచ్చుకున్న తుపాకీతో మన్‌దీప్‌ను కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయారు. జూన్ 28న రెన్స్ నగరంలోని రెన్స్ కన్వీనియ్స్ స్టోర్‌లో (Wrens Convenience Store) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారతీయ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
ఆగస్టా నగరంలో (Augusta) ఉండే మన్‌దీప్ ఆ కన్వీనియన్స్ స్టోర్‌లో ఉద్యోగంలో చేరి నెల కూడా కాలేదని తెలిసిం. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన ఇద్దరు 15 ఏళ్ల బాలురను అదుపులోకి తీసుకున్నట్లు రెన్స్ పోలీస్ చీఫ్ జాన్ మేనార్డ్ (John Maynard) తెలిపారు. మన్‌దీప్ సింగ్ మృతదేహాన్ని జార్జియా బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ ల్యాబ్‌కు తరలిస్తున్నట్లు జెఫెర్సన్ కౌంటీ కరోనర్ కార్యాలయం తెలిపింది. ఈ విపత్కర పరిస్ధితుల్లో బాధితుడి తల్లి, భార్యకు అండగా నిలిచేందుకు గాను 'గో ఫండ్ మీ' (Go Fund Me) పేజీలో నిధుల సేకరణను ప్రారంభించారు. దీని ద్వారా సమకూరే మొత్తాన్ని అంత్యక్రియల ఖర్చులు, ఇతర వ్యయాల కోసం మన్‌దీప్ సింగ్ కుటుంబానికి అందించనున్నారు.