H-1B Visa: హెచ్ 1బీ వీసాదారులకు వర్క్ పర్మిట్.. కెనడా పథకానికి భారీ స్పందన..!
ABN , First Publish Date - 2023-07-21T08:40:41+05:30 IST
అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం హెచ్-1బీ వీసా (H-1B Visa) పై ఉన్న నిపుణులకు తమ దేశంలో ఉద్యోగాలు చేసుకోవడానికి కొత్త వర్క్ పర్మిట్లు (New Work Permits) జారీ చేస్తామంటూ గత నెలలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకానికి భారీ స్పందన లభించింది.
H-1B Visa: అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం హెచ్-1బీ వీసా (H-1B Visa) పై ఉన్న నిపుణులకు తమ దేశంలో ఉద్యోగాలు చేసుకోవడానికి కొత్త వర్క్ పర్మిట్లు (New Work Permits) జారీ చేస్తామంటూ గత నెలలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పథకానికి భారీ స్పందన లభించింది. తొలి రోజే ఈ పథకం దాని లక్ష్యాన్ని (10వేల దరఖాస్తులు) అందుకోవడం విశేషం. హెచ్-1బీ వీసాదారులు కొత్త వర్క్ పర్మిట్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి జూలై 16 నుంచి కెనడా అనుమతించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (The Immigration, Refugees, and Citizenship Canada) దీనిపై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం తాము నిర్ణయించిన పరిమితికి సరిపడ అప్లికేషన్స్ రావడంతో ఈ పథకాన్ని తాత్కాలికంగా క్లోజ్ చేస్తునట్లు తెలిపింది. దరఖాస్తులు ఆహ్వానించిన ఒక్కరోజులోనే ఈ కొత్త స్కీమ్ కోసం 10వేల దరఖాస్తుల పరిమితిని చేరుకున్నామని ఐఆర్‌సీసీ (IRCC) తన ప్రకటనలో పేర్కొంది.
ఇక కెనడా ప్రభుత్వం జూన్‌లో ఈ కొత్త పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త సాంకేతికతలలో ప్రపంచ అగ్రగామిగా ఎదగాలని ఆశిస్తున్న కెనడా.. దీనికోసం విదేశీ ఐటీ నిపుణులను ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగానే ఈ కొత్త స్కీమ్‌ను తీసుకొచ్చింది. యూఎస్ టెక్ కంపెనీలలో హెచ్-1బీ వీసాపై ఉన్న నిపుణులు ఎవరైతే ఉద్యోగాలు కోల్పోతున్నారో వారిని ఆకర్షించడం ద్వారా టెక్నాలజీ రంగంలో బలంగా తయారు కావాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే హెచ్-1బీ వీసాదారుల ఫ్యామిలీ మెంబర్స్‌కు స్టడీ, వర్క్ పర్మిట్‌లను సైతం ఇస్తోంది. ఇక కొత్త పథకం కింద ఆమోదం పొందిన దరఖాస్తుదారులు మూడేళ్ల పరిమితితో ఓపెన్ వర్క్ పర్మిట్‌ను (Open Work Permit) పొందుతారు. తద్వారా వారు ఆ దేశంలో మూడేళ్ల పాటు ఎక్కడైనా పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా తాత్కాలిక నివాస వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సాధారణంగా యూఎస్‌లో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం సంపాదించిన వారు తమపై ఆధారపడిన వారిని డిపెండెంట్ వీసా (Dependent Visa) పై ఆ దేశానికి తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాను కెనడా కూడా పాటిస్తుందన్నమాట.
Duty Free Draw: జర్నీ చేస్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్.. భారతీయుడికి రూ.8 కోట్లు తెచ్చిపెట్టింది.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!
అయితే, ప్రస్తుతం అమెరికాలో హెచ్-1బీ వీసాదారులను కూడా 60 రోజుల గ్రేస్ పీరియడ్ నిబంధన తీవ్రంగా భయపెడుతోంది. ఈ నిబంధన ప్రకారం హెచ్-1బీ వీసాదారులు (H-1B Visa Holders) ఒకవేళ ఉద్యోగాన్ని కోల్పోతే.. 60 రోజుల లోపు కొత్త ఉద్యోగాన్ని సంపాదించాలి. అలా జాబ్ సంపాదించకపోతే వారు ఆ దేశంలో ఉండటానికి అనర్హులుగా పరిగణించబడతారు. దాంతో అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇక ఇప్పటికే గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon) వంటి టెక్ దిగ్గజాలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. దాంతో అగ్రరాజ్యంలో భారీ సంఖ్యలో ఉండే భారతీయులతో సహా నైపుణ్యం కలిగిన వేలాది మంది విదేశీ నిపుణులు జాబ్స్ కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. కాగా, అమెరికన్ మీడియా నివేదికల ప్రకారం.. 2022 నవంబర్ నుంచి ఇప్పటివరకు సుమారు 2లక్షల మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారని సమాచారం. ఇలా ఈ నిబంధన ప్రకారం హెచ్-1బీ వీసాపై ఉన్న నిపుణులను ఎవరైతే అగ్రరాజ్యం నుంచి వచ్చేస్తున్నారో.. వారినే ఇప్పుడు కెనడా ఆకర్షించే పనిలో పడింది. దీనిలో భాగంగానే కొత్త పథకాన్ని ప్రకటించడం, వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించడం అన్ని చకచకా జరిగిపోయాయి.