Tech Tips: విదేశీ ప్రయాణాల్లో యూపీఐ పేమెంట్స్ ఎలా చేయాలో తెలుసా? ఈ భారతీయ సర్వీస్ అందుబాటులో ఉన్న దేశాలు ఏవంటే..!
ABN , First Publish Date - 2023-07-23T10:20:34+05:30 IST
భారత్‌లో విరివిగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ మోడ్ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (Unified Payments Interface).
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో విరివిగా ఉపయోగిస్తున్న డిజిటల్ పేమెంట్ మోడ్ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (Unified Payments Interface). మొదట్లో దేశీయ అవసరాల కోసం ప్రారంభించిన ఈ వ్యవస్థ.. ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల కోసం కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఎన్నారైలకు (NRIs), విదేశాలకు వెళ్లే భారతీయులకు ఈ పేమెంట్ మోడ్ ఎంతో ఉపయోగకరంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యూపీఐ ఐడీ (UPI ID) కానీ, బ్యాంక్ ఖాతా నంబర్‌తో కానీ ఎవరికైనా పేమెంట్లు చేయడానికి దీని ద్వారా వీలు పడుతుంది. అంతేగాక సులభంగా, సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవడానికి యూపీఐ బాగా హెల్ప్ అవుతోంది. కాగా, విదేశాలలో ఉంటున్న భారతీయులకు కూడా ఈ మోడ్‌లో లావాదేవీల కోసం ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) తో పాటు అనేక దేశాలలో యూపీఐ పేమెంట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ (UPI Payments) అందుబాటులో ఉన్న దేశాల జాబితాను పరిశీలిస్తే.. ఫ్రాన్స్, భూటాన్, నేపాల్, ఒమాన్, యూఏఈ, మలేషియా, థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, వియత్నాం, సింగపూర్, కంబోడియా, హాంగ్‌కాంగ్, తైవాన్, దక్షిణ కొరియా, జపాన్, బ్రిటన్, ఐరోపా. ఈ దేశాలకు ప్రయాణించే భారతీయులు యూపీఐని ఉపయోగించి ఆన్‌లైన్ లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ లావాదేవీల కోసం మీరు ఫోన్‌పే (PhonePe), గూగుల్ పే (Google Pay), పేటీఎం (Paytm), అమెజాన్ పే (Amazon Pay) తో పాటు ఇతర యూపీ పేమెంట్ యాప్‌లను వినియోగించవచ్చు. ఈ యాప్‌లు మీ UPI ID (లేదా) లింక్ చేసిన బ్యాంక్ ఖాతాను ఉపయోగించి డిజిటల్ పేమెంట్లను నిర్వహించడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి.
ఇతర దేశాలలో యూపీఐ యాప్‌లను ఉపయోగించే ప్రాసెస్ ఇదే..
Step 1: దేశంలో అంతర్జాతీయ యూపీఐ లావాదేవీలను అనుమతించే PhonePe, Google Pay లేదా Paytm ద్వారా UPI ఆధారిత మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Step 2: ఆ తర్వాత ఈ యూపీఐ యాప్‌తో మీ భారతీయ బ్యాంక్ ఖాతాను రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Step 3: అలా మీ బ్యాంక్ ఖాతా లింక్ చేసిన తర్వాత రిసీవర్ వివరాలు అంటే.. వారి బ్యాంక్ అకౌంట్ నంబర్, IBAN, BICతో సహా ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన మొత్తం కరెన్సీతో సహా అందించాలి. లావాదేవీ పూర్తయిన తర్వాత మీకు కన్ఫార్మ్ (Confirm) మెసేజ్ వస్తుంది.
Step 4: ఇక మీ ఖాతా లింక్ చేయబడిన తర్వాత భారతదేశంలో యూపీఐ ఐడీ (UPI ID) కలిగిన ఎవరికైనా చెల్లింపులు చేయడానికి మీరు యూపీఐని ఉపయోగించడం ప్రారంభించవచ్చు.