Operation Kaveri: సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు అంతా సిద్ధం

ABN , First Publish Date - 2023-04-25T07:27:22+05:30 IST

సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరిన ఆఫ్రికా దేశం సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.

Operation Kaveri: సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు అంతా సిద్ధం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24: సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య అంతర్యుద్ధం తారాస్థాయికి చేరిన ఆఫ్రికా దేశం సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం సోమవారం ‘ఆపరేషన్‌ కావేరీ’ పేరుతో తొలి విడతగా రెండు సీ-130 మిలటరీ విమానాలు, నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సుమేధను సూడాన్‌ తీరప్రాంతం, సౌదీ ఆరేబియాలోని జెడ్డా ఎయిర్‌ఫోర్స్‌ కేంద్రానికి తరలించింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. వారం రోజులుగా అంతర్యుద్ధం ఉధృతమైన నేపథ్యంలో ఇరుపక్షాల మధ్య జరిగిన భీకర పోరులో 300 మంది దాకా మృతిచెందారని, మూడు వేల మంది గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ నెల 17న జరిగిన కాల్పుల్లో కేరళకు చెందిన అల్బర్ట్‌ అగస్టీన్‌ చనిపోయారు. దీంతో ప్రధాని మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి, సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే విదేశాంగ శాఖ ‘ఆపరేషన్‌ కావేరీ’కి శ్రీకారం చుట్టింది. సోమవారం 500 మంది భారతీయులు సూడాన్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. వారిని సురక్షితంగా భారత్‌కు తరలించేలా విదేశాంగశాఖ ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఆదివారం ఫ్రాన్స్‌ చేపట్టిన ఆపరేషన్‌లో 28 దేశాలతో పాటు.. ఐదుగురు భారతీయులను కూడా పారిస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భారతీయుల భద్రత కోసం ఐరాస సహా.. సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్‌, అమెరికాలతో సూడాన్‌లోని భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.

నాలుగు నగరాల్లోనే ఎక్కువ

సూడాన్‌లో ప్రస్తుతం 4,400 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వీరిలో 1,200 మందికి చెందిన కుటుంబాలు 150-200 ఏళ్ల క్రితమే సూడాన్‌లో స్థిరపడ్డాయి. మిగతావారిలో ఎక్కువ శాతం ప్రొఫెషనల్స్‌గా పనిచేస్తున్నారు. ఐరాస మిషన్లు, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఒమ్దుర్మాన్‌, ఖసాలా, గెదర్‌ఫ(అల్‌-ఖద్రీఫ్‌), వాద్‌ మదానీ నగరాల్లో నివసిస్తున్నారు. ఈ నగరాలన్నీ రాజధాని ఖర్టూమ్‌కు 25 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్రస్తుతం హింస జరుగుతుంది కూడా ఖర్టూమ్‌లోనే కావడంతో భారతీయులపై ప్రభావం ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతర్యుద్ధం కారణంగా విమానాశ్రయం సహా.. పలు నగరాల్లో విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని నగరం సహా.. చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజల ఆకలికేకలు మొదలయ్యాయి. సూడాన్‌ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో కమ్యూనికేషన్‌ వ్యవస్థ స్తంభించిపోయింది. రవాణా సదుపాయాలు కూడా మృగ్యమయ్యాయి.

ఎందుకీ అంతర్యుద్ధం?

సూడాన్‌లో అంతర్యుద్ధానికి కారకులు సైనిక నాయకుడు అబ్దుల్‌ ఫత్హా అల్‌ బుర్హాన్‌, పారామిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌(ఆర్‌ఎ్‌సఎఫ్‌) జనరల్‌ మహమ్మద్‌ హమ్దాన్‌. 2019లో సూడాన్‌ అధ్యక్షుడు ఒమర్‌ అల్‌ బషీర్‌ను గద్దె దించడానికి వీరిద్దరూ కలిసి పనిచేశారు. 2021లో సైనిక తిరుగుబాటులోనూ కీలక పాత్ర పోషించారు. అయితే.. పౌర పాలనను పునరుద్ధరించే ప్రణాళికలో భాగంగా ఆర్‌ఎ్‌సఎ్‌ఫను సైన్యంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దీనికి బుర్హాన్‌ ఒప్పుకోలేదు. ఆర్‌ఎ్‌సఎ్‌ఫను సైన్యంలో విలీనం చేస్తే.. చీఫ్‌ ఎవరు? అసిస్టెంట్‌ చీఫ్‌ ఎవరు? అనే విషయంలో ప్రారంభమైన విభేదాలు అంతర్యుద్ధానికి దారితీశాయి.

Updated Date - 2023-04-25T07:29:01+05:30 IST