Indian American: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం..!

ABN , First Publish Date - 2023-04-25T11:46:46+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది.

Indian American: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళకు అరుదైన గౌరవం..!

మేరీల్యాండ్: అగ్రరాజ్యం అమెరికాలో భారత సంతతి మహిళా న్యాయవాదికి అరుదైన గౌరవం దక్కింది. మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (Maryland Chamber of Commerce).. ప్రఖ్యాత భారతీయ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ న్యాయవాది షీలా మూర్తిని( Sheela Murthy ) మే 11వ తేదీన ప్రతిష్టాత్మక మేరీల్యాండ్ బిజినెస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో (Maryland Business Hall of Fame ) చోటు కల్పించింది. ప్రతియేటా మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ ప్రముఖ వ్యక్తిని ఇలా సత్కరించడం ఆనవాయితీ. దీనిలో భాగంగానే ఈ ఏడాది షీలా మూర్తికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇక ఇలాంటి వారు తమ కృషి, అంకిత భావంతో వ్యాపారాల్లో గొప్ప విజయాలను తీసుకురావడంతో పాటు వారి సంస్థలను, ఉద్యోగులను, కమ్యూనిటీని సుసంపన్నం చేస్తారని మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన ప్రకటనలో పేర్కొంది. తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల షీలా మూర్తి హర్షం వ్యక్తం చేశారు.

కాగా, షీలా మూర్తి ప్రస్తుతం మేరీల్యాండ్ కేంద్రంగా పనిచేస్తున్న లా సంస్థకు అధ్యక్షురాలిగా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) పనిచేస్తున్నారు. మేరీల్యాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో క్రియాశీల సభ్యురాలిగా కొనసాగుతున్నారు. ఇది ఈ రాష్ట్రంలోని వ్యాపార సంస్థలకు న్యాయపరమైన సలహా సూచనలతో పాటు సహాయాన్ని అందిస్తుంది. యూఎస్‌లోని అగ్రశ్రేణి ఇమ్మిగ్రేషన్ న్యాయవాదుల్లో ఒకరైన షీలా మూర్తి.. గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరాలో 1961 అక్టోబర్ 12న జన్మించారు. ఆమె తండ్రి హెచ్ఎంఎస్ మూర్తి ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. తండ్రి ఉద్యోగ రీత్యా షీలా కుటుంబం భారత్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లడంతో ఆమె చదువులు కూడా వేర్వేరు చోట్ల జరిగింది. మొదట చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజ్ (Stella Maris College in Chennai) నుంచి హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత బెంగళూరులోని యూనివర్సిటీ లా కళాశాల (University Law College in Bengaluru) నుంచి లా పట్టా అందుకున్నారు.

US Visas: భారతీయులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది మనోళ్లకు భారీగా వీసాలు..!

ఇక హార్వర్డ్ లా స్కూల్ పూర్వ విద్యార్ధి అయిన షీలా మూర్తి.. 1994లో మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో (Baltimore) న్యాయ సంస్థను స్థాపించారు. అంతేకాదు. మేరీల్యాండ్‌లో 20 మంది అత్యంత ప్రభావవంతమైన సీఈఓలలో ఒకరిగా చోటు దక్కించుకున్నారు. 'మూర్తి నాయక్ ఫౌండేషన్‌'ను (Murthy Nayak Foundation) స్థాపించి తన భర్త వసంత్ నాయక్‌తో కలిసి ఆమె ఇండియా, అమెరికాలలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వలసదారుల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ కృషి చేస్తున్నారు.

Indian Origin: అమెరికాలో చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ.. నిజంగా చాలా గ్రేట్!


Updated Date - 2023-04-25T11:46:46+05:30 IST