Dubai: విషాదం.. దుబాయ్ భవనంలో అగ్నిప్రమాదం.. భారతీయ ప్రవాసుడు మృతి!
ABN , First Publish Date - 2023-10-20T07:31:54+05:30 IST
దుబాయ్‌లోని కరామా భవనం (Karama building) లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ ప్రవాసుడు (Indian expat) మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
దుబాయ్: దుబాయ్‌లోని కరామా భవనం (Karama building) లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ ప్రవాసుడు (Indian expat) మృత్యువాత పడ్డాడు. ఈ విషాద సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మృతుడిని కేరళ వాసిగా గుర్తించినట్లు ఓ సామాజిక కార్యకర్త వెల్లడించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని సామాజిక కార్యకర్త తెలిపారు. అలాగే ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన మరో ముగ్గురు నివాసితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు దుబాయ్ సివిల్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు.
No passport, no visa: మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకు వచ్చిన దుబాయ్.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే..
కరామా నుంచి తమకు అగ్నిప్రమాదం గురించి అర్ధరాత్రి 12.18 గంటల ప్రాంతంలో సమాచారం అందిందని, కేవలం మూడు నిమిషాల వ్యవధిలోనే సంఘటనాస్థలికి చేరుకున్నట్లు సివిల్ డిఫెన్స్ సిబ్బంది వెల్లడించింది. వెంటనే భవనంలోని వారిని ఖాళీ చేయించి అర్ధరాత్రి 12.40 గంటలలోపు మంటలను అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. అయితే, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, భవనంలోని మూడో అంతస్తులోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
సామాజిక కార్యకర్త నజీర్ వడనప్పిల్లీ (Nazeer Vadanappilly) మాట్లాడుతూ.. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిలో ఎక్కువ మంది కేరళ వాసులేనని తెలిపారు. భవనంలోని అద్దెదారులలో కొందరు ఉద్యోగాల కోసం విజిట్ వీసాల (Visit Visas) పై దుబాయ్ వచ్చారని, వారి అన్ని వస్తువులు, ధృవపత్రాలు వారి ప్లాట్లలోనే ఉన్నాయని నజీర్ చెప్పారు. ఈ ప్రమాద ఘటన స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.