US: అమెరికాలో పిడుగుపాటుకు గురైన.. ఈ తెలుగు యువతి విషయంలో నిజంగా అద్భుతమే జరిగింది..!
ABN , First Publish Date - 2023-07-29T09:49:56+05:30 IST
ఉన్నతచదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (Susroonya Koduru) పిడుగుపాటుకు గురై (Lightning Strike) కోమాలోకి వెళ్లింది.
హ్యూస్టన్: ఉన్నతచదువుల కోసం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని సుశ్రూణ్య కోడూరు (Susroonya Koduru) పిడుగుపాటుకు గురై (Lightning Strike) కోమాలోకి వెళ్లింది. ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కుదేలైన బాధితురాలి గుండె (Heart) లయ తప్పింది. బ్రెయిన్ కూడా డ్యామేజీ (Brain Damage) కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. అయితే, ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు వెంటిలేటర్‌ను తొలగించినట్లు వెల్లడించారు. గత వారం నుంచి వెంటిలేరట్ అవసరం లేకుండా ఆమె శ్వాస తీసుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. నిజంగా అద్భుతమే జరిగిందని తెలిపారు. "ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగవడంతో వెంటిలేటర్ సదుపాయాన్ని తొలగించాం. వైద్యుల బృందం నిరంతరం సుశ్రూణ్యను పర్యవేక్షిస్తున్నారు" అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఇక ఆమె కుటుంబ సభ్యులకు వీసా లభించడంతో వచ్చే వారం వారు హైదరాబాద్ నుంచి యూఎస్ చేరుకుంటారని ఆమె బంధువు సురేంద్ర కుమార్ కోతా (Surendra Kumar Kotha) చెప్పారు.
అసలేం జరిగిందంటే.. భారత్‌కు చెందిన 25 ఏళ్ల సుశ్రూణ్య.. యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్ (University of Houston) లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాస్టర్స్ చేస్తోంది. జూలై మొదటివారంలో ఆమె కొంతమంది స్నేహితులతో కలిసి స్థానికంగా ఉండే శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్ (San Jacinto Monument Park) కు వెళ్లింది. అక్కడి ఓ కొలను వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అప్పటికే వాతావరణం ముసురుపెట్టి చిన్నగా వర్షం మొదలైంది. క్రమంగా పెరిగిన వర్షం ఉరుములు, మెరుపులతో జడివానగా మారింది. అదే సమయంలో ఊహించని విధంగా సుశ్రూణ్యపై పిడుగుపడింది. దాంతో ఆమె పక్కనే ఉన్న కొలనులో పడిపోయింది.
Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల వరకు..!
ఆ సమయంలో ఆమె గుండె 20 నిమిషాల పాటు ఆగిపోయింది (Cardiac arrest for 20 minutes). దాంతో రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడు దెబ్బతిని కోమాలోకి (Coma) వెళ్లినట్లు ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఇక అప్పటి నుంచి ఆమెకు వైద్యం కొనసాగుతుంది. చాలా కాలం పాటు వైద్యం అందిస్తేగానీ, ఆమె కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు తేల్చేశారు. కానీ, ఆమె సుశ్రూణ్య విషయంలో అద్భుతమే జరిగింది. ఆమె త్వరగానే కోలుకుని కోమాలోంచి బయటకు వచ్చింది. సుశ్రూణ్య విషయంలో మిరాకిల్ జరిగిందని ఆమె కజిన్ సురేంద్ర కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఆమె వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ చేపట్టిన విషయం తెలిసిందే. దాతలు 'గోఫండ్‌మీ' (GoFundMe) ద్వారా ఆర్థిక సాయం అందించారు.