NRI: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి వ్యక్తి
ABN , First Publish Date - 2023-08-23T08:50:20+05:30 IST
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి (Indian origin) కి చెందిన థర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్ అధ్యక్ష ఎన్నిక కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.
సింగపూర్ సిటీ: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల రేసులో భారత సంతతి (Indian origin) కి చెందిన థర్మన్ షణ్ముగరత్నం (Tharman Shanmugaratnam) ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సింగపూర్ అధ్యక్ష ఎన్నిక కమిటీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. థర్మన్‌తో పాటు అధ్యక్ష పదవికి పోటిపడుతున్నవారిలో చైనీయులు కాక్ సాంగ్, తన్‌కిన్ లియాన్ కూడా ఉన్నారు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరు ముగ్గురు మాత్రమే అధక్ష పదవికి పోటీ పడటానికి అర్హత సాధించినట్లు ఎన్నికల కమిటీ వెల్లడించింది. కాగా, థర్మన్ 2011 నుంచి 2019 వరకు ఎనిమిదేళ్ల పాటు ఆ దేశ విద్యాశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా కొనసాగారు.
ఇక తనకు దక్కిన ఈ అరుదైన అవకాశం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా థర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. "నేను న్యాయమైన, దయగల, మరింత సమగ్రమైన సమాజాన్ని మాత్రమే విశ్వసిస్తున్నాను. నా జీవితం దానికి అంకితం చేయబడింది. సింగపూర్ నాకు చాలా ప్రత్యేకం" అని అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సింగపూర్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా, సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకోబ్ (Halimah Yacob) ఆరేళ్ల పదవీ కాలం సెప్టెంబర్ 13తో ముగియనుంది.