Kuwaitization: అనుకుంది సాధించిన కువైత్.. ఆ శాఖలో ఒక్క ప్రవాస ఉద్యోగి కూడా లేకుండా చేసేసింది!
ABN , First Publish Date - 2023-02-21T09:03:46+05:30 IST
గల్ఫ్ దేశం కువైత్ 2017లో ఉద్యోగావకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) తీసుకొచ్చింది.
కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ 2017లో ఉద్యోగావకాశాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో కువైటైజేషన్ పాలసీని (Kuwaitization Policy) తీసుకొచ్చింది. ప్రవాసుల ప్రాబల్యం రోజురోజుకూ పెరిగిపోతుండడంతో కువైటీలకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని భావించిన కువైత్ సర్కార్ ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి అటు ప్రభుత్వ రంగంతో పాటు ఇటు ప్రైవేట్ రంగంలోని ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ఎక్కువ అవకాశాలు ఇస్తూ వస్తోంది. ఇదే సమయంలో దశలవారీగా ప్రవాస ఉద్యోగులపై వేటు వేయడం చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా విద్యాశాఖ 100శాతం కువైటైజేషన్‌ను సాధించిందని సంబంధిత అధికారులు వెల్లడించారు. కువైటైజేషన్ అమలులోకి వచ్చిన 2017 జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 2,048 మంది ప్రవాస ఉద్యోగులను (Expat Employees) తొలగించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదే సమయంలో 629 మంది కువైటీలను కొత్తగా ఉద్యోగాల్లో తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శాఖలో 100 శాతం ఉద్యోగులు కువైత్ పౌరులేనని స్పష్టం చేశారు.
ఇదిలాఉంటే.. ఇప్పుడు ఇదే పాలసీ ఆ దేశానికి తలనొప్పిగా మారిందని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీలో భాగంగా అన్ని రంగాలు నిపుణులైన విదేశీ కార్మికులను కోల్పోతున్నాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కువైత్ సర్కార్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ పాలసీని అమలు చేసే పనిలోనే ఉంది. దీనిలో భాగంగానే గతేడాది వివిధ రంగాలకు చెందిన సుమారు 18వేల మంది ప్రవాసులను దేశం నుంచి పంపించి వేసింది. ఇక కువైటైజేషన్ పాలసీని కఠినంగా అమలు చేస్తుండడం గమనిస్తున్న ప్రవాసులు భారీ సంఖ్యలో ఆ దేశం నుంచి తరలిపోతున్నారు. దీనికి తోడు రెండేళ్లుగా మహమ్మారి ప్రభావం కూడా గట్టిగానే ఉండడంతో 2021లో సుమారు 2.57లక్షల మంది వలసదారులు కువైత్‌కు గుడ్‌బై చెప్పారు. దీంతో కువైత్‌లో కార్మికుల కొరత మొదలైంది. అటు బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, ఇతర మంచి కంపెనీల్లో టాప్ పోస్టుల్లో ఉన్న నైపుణ్యం గల ప్రవాసులు కూడా వెళ్లిపోయారు. ఇది ఇప్పుడు ఒకరకంగా కువైత్‌కు భారీ దెబ్బ అనే చెప్పాలి.
ఇది కూడా చదవండి: అయ్యో.. ఎంత పని చేశావమ్మా.. కువైత్‌లో హృదయాన్ని కలిచివేసే ఘటన!