Expatriates: ఒమాన్‌లో భారీగా పెరుగుతున్న ప్రవాసులు.. కొన్ని ప్రాంతాలలో ఒమానీల కంటే ప్రవాసులే అధికం..!
ABN , First Publish Date - 2023-08-18T10:09:47+05:30 IST
గల్ఫ్ దేశం ఒమాన్‌లో ప్రవాసుల జనాభా భారీగా పెరుగుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (National Centre for Statistics and Information) విడుదల చేసిన ఆగస్ట్ 2023 స్టాటిస్టికల్ ఇయర్ బుక్‌లోని నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి మస్కట్ గవర్నరేట్‌లో ఒమానీల కంటే ప్రవాస జనాభా (Expat Population) అధికంగా ఉంది.
మస్కట్: గల్ఫ్ దేశం ఒమాన్‌లో ప్రవాసుల జనాభా భారీగా పెరుగుతోంది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (National Centre for Statistics and Information) విడుదల చేసిన ఆగస్ట్ 2023 స్టాటిస్టికల్ ఇయర్ బుక్‌లోని నివేదిక ప్రకారం 2022 చివరి నాటికి మస్కట్ గవర్నరేట్‌లో ఒమానీల కంటే ప్రవాస జనాభా (Expat Population) అధికంగా ఉంది. మస్కట్ గవర్నేట్ (Muscat Governorate) లోని బౌషర్ పరిధిలోని విలాయత్‌లో అత్యధికంగా 3,19,921 మంది ప్రవాసులు ఉన్నారు. అదే సీబ్‌లోని విలాయత్‌లో అత్యధికంగా 2,68,580 మంది ఒమానీలు ఉన్నారని నివేదిక వెల్లడించింది. ఇక 2022 ఏడాది ముగిసేసరికి వలసదారుల జనాభా 20,66,239కు చేరింది. అదే 2021లో ఈ సంఖ్య 17,23,329గా ఉంది. ఇక 2022 చివరి నాటికి ఒమన్ మొత్తం జనాభా వచ్చేసి 49,33,850.
మస్కట్ గవర్నేట్‌లో అత్యధికంగా 8,37,732 మంది ప్రవాసులు (Expatriates) ఉంటున్నారు. ఈ గవర్నరేట్‌లో ఒమానీల సంఖ్య కేవలం 5,63,724 మాత్రమే. కాగా, బౌషర్‌లో మాత్రం ఒమానీల కంటే ప్రవాసుల సంఖ్య 2,27,298 అధికంగా ఉండడం గమనార్హం. అదే ముత్రాహ్‌లో 1,43,950 మంది అధికంగా ఉన్నారు. ఇక విలాయత్‌లోని అల్ అమెరత్ పరిధిలో ఉన్న విలాయత్ శివారులో మాత్రం ప్రవాసుల కంటే ఒమానీలు అధికంగా ఉన్నారు. అక్కడ ఒమాన్ జాతీయులు 93,555 మంది ఉంటే.. ప్రవాసులు 46,200 మంది ఉన్నారు. అలాగే ఖురియాత్‌లో కూడా ఒమానీల జనాభా అధికంగా ఉంది. ఇక్కడ ఒమానీలు 49,001 మంది ఉండగా.. ప్రవాసులు కేవలం 14,005 మంది మాత్రమే ఉన్నారు. ఇక సుల్తానేట్ ఆఫ్ ఒమాన్‌లోని రెండవ అత్యధిక ప్రవాస జనాభా కలిగిన ప్రాంతం అల్ బతినా నార్త్ గవర్నరేట్. ఇక్కడ 2022లో నమోదైన ప్రవాసుల జనాభా 2,95,460. ఇది 2021లో 2,31,705గా ఉంది.