Expat Layoffs in Kuwait: వెనక్కి తగ్గిన కువైత్.. ఆనందంలో ప్రవాసులు..!
ABN , First Publish Date - 2023-04-16T19:57:47+05:30 IST
కువైత్ విద్యా మంత్రిత్వశాఖ (Kuwait Ministry of Education) ప్రవాస టీచర్ల, బోధనేతర సిబ్బంది తొలగింపు ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది.
కువైత్ సిటీ: కువైత్ విద్యా మంత్రిత్వశాఖ (Kuwait Ministry of Education) ప్రవాస టీచర్ల, బోధనేతర సిబ్బంది తొలగింపు ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. అర్హత కలిగిన కువైటీలు, జీసీసీ జాతీయులు, కువైటీ తల్లులకు జన్మించిన పిల్లలు భర్తీ చేయడానికి అందుబాటులో ఉండే వరకు ప్రవాస సిబ్బంది (Expat Staff) తొలగింపును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మంత్రిత్వశాక వెల్లడించింది. కాగా, ఇప్పటికే తొలగించబడిన ప్రవాస బోధన, బోధనేతర సిబ్బంది స్థానంలో నియమించేందుకు అర్హూలైన స్థానికులు దొరకడం లేదని అక్కడి స్థానిక మీడియా ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో విద్యా రంగంలో కువైటైజేషన్ పాలసీని (Kuwaitaization Policy) నెమ్మదిగా అమలు చేయాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌ను మంత్రిత్వశాఖ పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం.
అందుకే తాజాగా ఈ ప్రవాస టీచర్ల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసిందని తెలుస్తోంది. దేశంలో విద్యాస్థాయి ప్రమాణాలు ఒక్కసారిగా పడిపోకుండా ఉండాలంటే అర్హత కలిగిన కువైటీల లభ్యతను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాలని మంత్రిత్వశాఖ భావిస్తుందట. అందుకే అదే స్థాయిలో పనితీరును కనబరిచే కువైటీలు (Kuwaitis) దొరికే వరకు ప్రవాసుల తొలగింపు ప్రక్రియను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. దీంతో ప్రవాస టీచర్లు, బోధనేతర సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత కాలం కువైత్‌లో పని చేసుకునే వెసులుబాటు కలిగిందని మురిసిపోతున్నారు.