Golden Visa: విదేశీయులకు రికార్డుస్థాయిలో గోల్డెన్ వీసాలు జారీ చేసిన దుబాయ్..!
ABN , First Publish Date - 2023-09-20T08:59:20+05:30 IST
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా (Golden Visa). ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. ఇక తాజాగా వెలువడిన డేటా ప్రకారం దుబాయ్‌లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి.
అబుధాబి: వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం మంజూరు చేసేదే గోల్డెన్ వీసా (Golden Visa). ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. ఇక తాజాగా వెలువడిన డేటా ప్రకారం దుబాయ్‌లో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి. గతేడాది మొదటి అర్ధభాగంతో పొలిస్తే ఏకంగా 52శాతం అధికంగా ఈసారి వీసాలు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (General Directorate of Residency and Foreigners Affairs) డేటా వెల్లడించింది. 2019లో యూఏఈ ఈ గోల్డెన్ వీసాలను తీసుకువచ్చినప్పటి నుంచి 2022 నవంబర్ నాటికి దుబాయ్ అర్హులైన నివాసితులు, పెట్టుబడిదారులు, నిపుణులు, ఇతరులకు కలిపి మొత్తంగా 1,50,000 కంటే ఎక్కువ గోల్డెన్ వీసాలను జారీ చేసింది.
కాగా, జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) ప్రకారం ఎమిరేట్ రెసిడెన్సీ వీసాల (Residency visas ) సంఖ్య 63 శాతం పెరిగింది. అలాగే పర్యాటక వీసాలు (Tourist Visas) జనవరి-జూన్ కాలంలో 21 శాతం పెరిగాయి. అటు మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత దుబాయ్ జనాభా గణనీయంగా పెరిగింది. జనవరి 2023 నుండి ఎమిరేట్ జనాభా 72,700కి పైగా పెరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో 35.50 లక్షలుగా ఉన్నా జనాభా.. జూన్ చివరి నాటికి 36.23 లక్షలకు చేరుకుంది.
ఇక 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు వీలు కల్పిస్తుంది. అలాగే వందశాతం ఓనర్‌షిప్‌తో ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు. యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో ఉంటుంది. అంతేగాక ఆటోమెటిక్‌గా పునరుద్ధరించబడుతుంది.
అసలు గోల్డెన్ వీసా ఎవరికిస్తారంటే..
2018 కేబినెట్ తీర్మానం నెం. 56 ప్రకారం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్లు), పారిశ్రామికవేత్తలు, సైన్స్, నాలెడ్జ్, స్పోర్ట్స్ రంగంలోని నిపుణులు, ప్రత్యేక ప్రతిభావంతులకు గోల్డెన్ వీసా ఇస్తారు. 5, 10 ఏళ్ల కాలపరిమితితో వచ్చే వీసాల అర్హుల విషయానికి వస్తే..
10 ఏళ్ల వీసాకు అర్హులు ఎవరంటే..
పదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు(కనీసం రూ. 20.50కోట్ల పెట్టుబడి), ప్రత్యేక ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులు:
పబ్లిక్ పెట్టుబడులలో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్ పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడి అనేక రూపాల్లో ఉండవచ్చు.
* దేశంలోని ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌లో కనీసం 10 మిలియన్ దిర్హమ్స్(రూ.20.50కోట్లు) డిపాజిట్ చేయడం
* యూఏఈలో రూ.20.50కోట్లకు తక్కువ కాకుండా మూలధనంతో కంపెనీని స్థాపించడం
* రూ. 20.50కోట్లకు తగ్గకుండా షేర్ విలువ కలిగిన ప్రస్తుత, కొత్త కంపెనీలో భాగస్వామిగా చేరడం
షరతులు:
* పెట్టుబడి పెట్టిన ధనం లోన్ రూపంలో తీసుకోని ఉండకూడదు.
* పెట్టుబడులను కనీసం మూడేళ్లపాటు ఉంచాలి.
* రూ.20.50కోట్ల వరకు ఫైనాన్షియల్ సాల్వెన్సీ ఉండాలి.
వ్యాపార భాగస్వాములకు కూడా ఈ వీసాను అనువర్తింప చేయవచ్చు. అయితే, ప్రతి భాగస్వామి రూ.20.50కోట్లకు తగ్గకుండా పెట్టుబడి పెట్టాలనే షరతు అనురించాల్సి ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఒక సలహాదారు ఉండవచ్చు. ఇక విదేశాల నుండి పెట్టుబడిదారులు ఆరు నెలల కాలానికి మల్టీపుల్ ఎంట్రీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
5 ఏళ్ల గోల్డెన్ వీసాకు అర్హులు వీరే..
ఐదేళ్ల వీసా కోసం పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ప్రతిభావంతులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
1. పెట్టుబడిదారులు:
* పెట్టుబడిదారుడు 5 మిలియన్ల దిర్హమ్స్‌కు(రూ.10.25కోట్లు) తగ్గకుండా స్థూల విలువ కలిగిన ఆస్తిలో పెట్టుబడి పెట్టాలి.
* రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టిన మొత్తం రుణం తీసుకున్నదై ఉండకూడదు.
* ఆస్తిని కనీసం మూడేళ్లపాటు నిలుపుకోవాలి.
2. పారిశ్రామికవేత్తలు:
* 5లక్షల మిలియన్ దిర్హమ్స్ కనీస మూలధనంతో ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ ఉన్నవారు లేదా దేశంలో గుర్తింపు పొందిన బిజినెస్ ఇంక్యుబేటర్ ఆమోదం పొందిన పారిశ్రామికవేత్తలు
* వ్యవస్థాపకుడికి ఆరు నెలల పాటు మల్టీ-ఎంట్రీ వీసా అనుమతించబడుతుంది. మరో ఆరు నెలలకు పునరుద్ధరించబడుతుంది. దీర్ఘకాలిక వీసాలో జీవిత భాగస్వామి, పిల్లలు, భాగస్వామి, ముగ్గురు ఎగ్జిక్యూటివ్‌లు ఉంటారు.
3. ప్రతిభావంతులైన విద్యార్థులు:
* ప్రభుత్వ, ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలల్లో కనీసం 95 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అత్యుత్తమ విద్యార్థులు.
* విశ్వవిద్యాలయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో కనీసం 3.75 డిస్టింక్షన్ జీపీఏ కలిగి ఉన్నవారు.
* దీర్ఘకాలిక వీసాలో అత్యుత్తమ విద్యార్థుల కుటుంబాలు ఉంటాయి.