NATS: తెలుగు భాష పరిరక్షణ ప్రతి తెలుగువాడి బాధ్యత కావాలి: కవి బాలాంత్రపు

ABN , First Publish Date - 2023-09-23T10:11:09+05:30 IST

'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తెలుగు భాష గొప్పదనం.. పరిరక్షణపై అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది.

NATS: తెలుగు భాష పరిరక్షణ ప్రతి తెలుగువాడి బాధ్యత కావాలి: కవి బాలాంత్రపు

నాట్స్ సాహిత్య సదస్సులో ప్రముఖ కవి బాలాంత్రపు వెంకట రమణ పిలుపు

ఎన్నారై డెస్క్: 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం 'నాట్స్' తెలుగు భాష గొప్పదనం.. పరిరక్షణపై అంతర్జాల వేదికగా సదస్సులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ లలితా కళా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు భాష మాధుర్యంపై నిర్వహించిన సదస్సుకు మంచి స్పందన లభించింది. ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త బాలాంత్రపు వెంకట రమణ ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగు భాష గొప్పదనం గురించి ఆయన వివరించారు. తెలుగు వారంతా తెలుగు భాష పరిరక్షణ కోసం నడుం బిగించాలని.. ఇది ప్రతి తెలుగువాడి బాధ్యతగా భావించాలని వెంకట రమణ పిలుపునిచ్చారు. తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని దానిని కూడా నేటి తరం విస్మరిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష అంతరించే భాషల్లో ఉందనే ప్రమాదాన్ని గుర్తించి తెలుగువారంతా తమ మాతృభాష పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు.

NN.jpg

తెలుగుభాష పునర్ వైభవం కోసం ప్రతి తెలుగువాడు తెలుగులో మాట్లాడటంతో పాటు తమ పిల్లలకు కచ్చితంగా తెలుగులో మాట్లాడటం, చదవటం అలవాటు చేయాలని కోరారు. తెలుగు ప్రబంధ సాహిత్యంలోని గొప్పదనాన్ని నేటి తరానికి అందించేందుకు సరళమైన భాషలో తీసుకొస్తున్నానని వెంకటరమణ తెలిపారు. ఈ సదస్సుకు నాట్స్ మాజీ ఉపాధ్యక్షుడు శాయి ప్రభాకర్ యఱ్ఱాప్రగడ వ్యాఖ్యతగా వ్యవహారించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ చేస్తున్న కృషిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి వివరించారు. తెలుగు సాహిత్యాన్ని నేటి తరానికి చేరువ చేసేందుకు బాలాంత్రపు వెంకట రమణ చేస్తున్న ప్రయత్నాలు అభినందించదగినవని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి అన్నారు. ఈ సాహిత్య సదస్సులో బాలాంత్రపు వెంకట రమణ తెలుగు వారి ప్రవాస తెలుగువారి సాహిత్య సందేహాలను నివృత్తి చేశారు.

Updated Date - 2023-09-23T10:22:35+05:30 IST