Kuwait: 11.50లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీలు రద్దు చేసిన కువైత్.. అయినా ఇప్పటికీ మనోళ్లే టాప్!
ABN , First Publish Date - 2023-05-02T08:34:15+05:30 IST
గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.
కువైత్ సిటీ: గత కొంతకాలంగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. కువైటైజేషన్ పాలసీ (Kuwaitization Policy) పేరిట వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. స్థానికులకు అధిక ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ప్రవాసులను (Expats) భారీ మొత్తంలో దేశం నుంచి వెళ్లగోడుతోంది. దీనిలో భాగంగా రెసిడెన్సీ, వర్క్ వీసాల నిబంధనలను కఠినతరం చేసింది. అటు ఉల్లంఘనలకు పాల్పడిన వారిని వెంటనే దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఇక తాజాగా వెలువడిన గణాంకాల ప్రకారం గడిచిన మూడేళ్లలో కువైత్ ఏకంగా 11.50లక్షల మంది ప్రవాసుల రెసిడెన్సీలను రద్దు (Expatriates Residencies Revoked) చేసినట్లు తెలిసింది.
ఈ డేటా ప్రకారం 2021లో 2.27లక్షల మంది ప్రవాసులు ఆ దేశాన్ని వదిలివెళ్లారు. వీరిలో దాదాపు 1.60లక్షల మందికి ఎలాంటి పరిహారం దక్కలేదట. అంతేగాక వీరిలో చాలామంది ప్రైవేట్ సెక్టార్, డొమెస్టిక్ వర్కర్లు (Domestic Workers) ఉన్నారు. ప్రపంచం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (International Labor Day) జరుపుకుంటున్న తరుణంలో ఈ పోకడలు కువైత్‌లోని వలస కార్మికుల పట్ల ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కాగా, 2022లో మాత్రం కువైత్ లేబర్ మార్కెట్‌లో కొత్తగా 67వేల మంది ప్రవాసులు చేరినట్లు డేటా చెబుతోంది. వీరిలో 64శాతం మంది గృహ కార్మికులు ఉన్నారు. అలాగే గతేడాది నిర్మాణ రంగంలో కూడా భారీగానే వలస కార్మికులు చేరారు. 2.18లక్షల మంది విదేశీ కార్మికులు ఈ రంగంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2021లో ఈ సంఖ్య 1లక్షగా మాత్రమే నమోదైంది. దీంతో పాటు ట్రేడింగ్ సెక్టార్‌లో కూడా వలస కార్మికుల స్వల్ప పెరుగుదల కనిపించింది. గతేడాది 64వేల మంది ట్రేడింగ్ రంగంలో ఉపాధి పొందారు.
Indian Community: కువైత్‌లోని భారతీయులకు ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ బంపరాఫర్.. అనేక ఉత్పత్తులపై మనోళ్లకు ప్రత్యేకమైన తగ్గింపు
ఇక తయారీ రంగం (Manufacturing Sector) మొత్తం కార్మికుల సంఖ్య 1.46లక్షలకు చేరితే.. ఫిషింగ్ మరియు వ్యవసాయ రంగంలో (Fishing and Agricultural Sector) 74వేల మంది వలస కార్మికులు ఉన్నట్లు డేటా ద్వారా తెలిసింది. అలాగే హోటల్ అండ్ రెస్టారెంట్ సెక్టార్‌లో 2022 ఏడాది చివరినాటికి 59వేల మంది వర్కర్లు ఉన్నారని తేలింది. ఇదిలాఉంటే.. భారత కమ్యూనిటీ మాత్రం తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికీ అక్కడ ఉన్న విదేశీ కార్మికుల్లో మనోళ్లే టాప్‌లో ఉన్నారు. కువైత్‌లో భారత ప్రవాసులు 9,65,774 మంది ఉన్నట్లు తాజాగా డేటా వెల్లడించింది. మన తర్వాత ఈజిప్టియన్లు (6,55,234), ఫిలిపీన్స్ (2,74,777), బంగ్లాదేశ్ (2,56,849), సిరియా (1,62,340) ఉన్నారు.