Saudi Arabia: ఉల్లంఘనదారులపై సౌదీ ఉక్కుపాదం.. వారం రోజుల్లోనే 10వేల మంది అరెస్ట్..!
ABN , First Publish Date - 2023-07-04T08:23:50+05:30 IST
ఉల్లంఘనదారులపై సౌదీ అరేబియా (Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది.
రియాద్: ఉల్లంఘనదారులపై సౌదీ అరేబియా (Saudi Arabia) ఉక్కుపాదం మోపుతోంది. రెసిడెన్సీ, కార్మిక చట్టాలతో పాటు సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన సుమారు 10,710 మందిని వారం రోజుల్లో వివిధ ప్రాంతాలలో అరెస్ట్ చేసినట్లు సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Interior Ministry) వెల్లడించింది. జూన్ 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు కింగ్‌డమంతటా భద్రతా దళాలు తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొంది. ఇక అదుపులోకి తీసుకున్నవారిలో 6,070 మంది నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వారు, 3,071 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన వారు, 1,569 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారని తెలిపింది. అలాగే సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన 558 మందిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఇందులో 49శాతం మంది యెమెన్లు, 48శాతం ఇథియోపియన్లు, 3శాతం ఇతర జాతీయులు ఉన్నారని వెల్లడించారు.
అలాగే రెసిడెన్సీ, వర్క్ నిబంధనలను ఉల్లంగించేవారిని రవాణా చేయడం, ఆశ్రయం కల్పించడం, వారి కార్యకలాపాలను సహకరించిన 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇక ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 33,555 మంది ఉల్లంఘనదారులను అదుపులోకి తీసుకోగా.. వీరిలో 28,072 మంది పరురుషులు, 5,483 మంది మహిళలు ఉన్నారు. వారిలో 25,507 మంది ఉల్లంఘనలకు పాల్పడినవారిని ప్రయాణ పత్రాలను పొందేందుకు వారి దౌత్య కార్యాలయాలకు, 1,621 మంది ఉల్లంఘనదారులను వారి ప్రయాణ రిజర్వేషన్లను పూర్తి చేయడానికి, మరో 6,274 మంది ఉల్లంఘనదారులను దేశం నుంచి బహిష్కరించడం జరిగింది. కాగా, ఎవరైనా చొరబాటుదారులను దేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేసినా, అతడు/ఆమెకు రవాణా సౌకర్యం, ఆశ్రయం, మరేతర సాయం చేసిన కూడా అలాంటి వారికి గరిష్టంగా 15 ఏళ్ల జైలు, 1మిలియన్ సౌదీ రియాళ్ల జరిమానా ఉంటుందని అంతర్గత మంత్రిత్వశాఖ హెచ్చరించింది.