Saudi Arabia: సౌదీలో వారం రోజుల వ్యవధిలోనే 13,308 మంది అరెస్ట్ !
ABN , First Publish Date - 2023-07-30T12:09:02+05:30 IST
అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 13వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు.
రియాద్: అరబ్ దేశం సౌదీ అరేబియా (Saud Arabia) ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వారం రోజుల వ్యవధిలోనే 13వేల మందికి పైగా ప్రవాసులు (Expats) అరెస్ట్ అయ్యారు. రెసిడెన్సీ, వర్క్, సరిహద్దు భద్రతా నిబంధనలు ఇలా పలు ఉల్లంఘనలకు పాల్పడిన సుమారు 13,308 మంది ప్రవాసులను సౌదీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అది కూడా వారం రోజుల వ్యవధిలోనే (20 నుంచి 26 తేదీల మధ్యలో) ఇంత భారీ మొత్తంలో అరెస్టులు జరగడం గమనార్హం. ఇక అరెస్టైన వారిలో 7,725 మంది రెసిడెన్సీ చట్టాలను ఉల్లంఘించినవారు (Violations of Residency Laws) ఉన్నారు. మరో 3,427 మంది అక్రమంగా దేశ సరిహద్దు (Illegal Border Crossing) దాటారు. అలాగే 2,156 మంది కార్మిక చట్టాలను ఉల్లంఘించగా (Violations of Labor Laws).. 572 మంది పక్క దేశాల నుంచి ప్రవేశించినవారు ఉన్నారు.
ఇక అదుపులో తీసుకున్నవారిలో 62 శాతం మంది యెమెన్ దేశస్తులు (Yemenis) ఉండగా, 37 శాతం మంది ఇథియోపియన్, 1 శాతం మంది ఇతర దేశాలకు చెందినవారు ఉన్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. రవాణా, ఆశ్రయం కల్పించడంతో సహా ఎవరైనా కింగ్డమ్లోకి అక్రమంగా ప్రవేశించడాన్ని సహాయం చేసినట్లు తేలితే.. గరిష్టంగా 15 సంవత్సరాల జైలు శిక్ష, 1 మిలియన్ సౌదీ రియాళ్లు(రూ. 2.13కోట్లు) వరకు జరిమానా ఉంటుందని సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Saudi Ministry of Interior) హెచ్చరించింది. అలాగే వాహనాలను కూడా జప్తు చేయడం జరుగుతుందని తెలిపింది. ఇక అనుమానాస్పద ఉల్లంఘనలపై ఫిర్యాదు కోసం మక్కా, రియాద్ ప్రాంతాల వాసులు టోల్-ఫ్రీ నంబర్ 911కు, కింగ్డమ్లోని ఇతర ప్రాంతాల వారు 999 లేదా 996కు కాల్ చేయవచ్చని మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.