Saudi Arabia: సౌదీ సీరియస్ వార్నింగ్.. అలాంటి వారికి సాయం చేస్తే.. రూ.22లక్షల జరిమానాతో పాటు దేశ బహిష్కరణ..!
ABN , First Publish Date - 2023-03-22T11:22:32+05:30 IST
సౌదీ అరేబియా (Saudi Arabia) దేశంలోని నివాసితులు, యజమానులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది.
రియాద్: సౌదీ అరేబియా (Saudi Arabia) దేశంలోని నివాసితులు, యజమానులకు తాజాగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. చెల్లుబాటయ్యే వీసా లేని వారికి ఎట్టిపరిస్థితుల్లో ఎలాంటి సాయం చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పబ్లిక్ సెక్యూరిటీ అథారిటీ (Public Security Authority) కీలక ప్రకటన చేసింది. వీసాల నిబంధనలను ఉల్లంఘించేవారికి (Visa Violators) ఉపాధి కల్పించడం, ఆశ్రయం ఇవ్వడం, సహాయం చేయడం వంటివి చేయకూడదని నివాసితులను (Residents) కోరింది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే అలాంటి వారికి 1లక్ష సౌదీ రియాళ్ల (సుమారు రూ. 22లక్షలు) జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలియజేసింది. అలాగే శిక్షకాలం పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుందని తెలిపింది.
అదేవిధంగా తగిన వీసాలేని కార్మికులను నియమించుకునే యజమానులకు కూడా 1లక్ష సౌదీ రియాల్స్ (సుమారు రూ. 22లక్షలు) జరిమానాతో పాటు 6నెలల జైలు శిక్ష ఉంటుందని తన ప్రకటనలో పేర్కొంది. అంతేగాక సదరు యజమానులు ఆరు నెలల పాటు రిక్రూట్మెంట్ నిర్వహించకుండా బ్యాన్ (Banned) ఉంటుందని స్పష్టం చేసింది. ఇక వీసా షరతులను పూరించని స్వయం ఉపాధి పొందే (Self Employeed) వ్యక్తికి 50వేల సౌదీ రియాళ్ల (రూ.11లక్షలు) వరకు జరిమానా విధించబడుతుంది. అలాగే 6 నెలల జైలు శిక్ష కూడా ఉంటుంది. ఆ తర్వాత సదరు వ్యక్తిని దేశం నుంచి బహిష్కరిస్తారు. మక్కా అల్-ముకర్రామా, రియాద్, తూర్పు ప్రావిన్స్‌లోని ప్రజలు 911 నంబర్‌కు, దేశంలోని మిగిలిన ప్రాంతాలలో నివాసం ఉండేవారు 999 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి సమాచారం ఇవ్వొచ్చని తెలియజేసింది.
ఇది కూడా చదవండి: ప్రముఖ సీనియర్ నటి కుమార్తెకు యూఏఈ 'గోల్డెన్ వీసా'..!